ఏపీలో పోలీస్ వ్యవస్థ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య . అధికార పార్టీ చేతిలో పోలీసులు కీలు బొమ్మలా మారిపోయారని ఆయన మండిపడ్డారు. శిరీషకు ఒక న్యాయం.. అనంత బాబుకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రామయ్య ఆరోపించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి (ys jagan) ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన నాటి నుండి వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు టీడీపీ (tdp) పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (varla ramaiah) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తన ఉనికినే కోల్పోయిందన్నారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా తయారవడం బాధాకరమని... అనేకసార్లు పోలీసు అధికారులను హెచ్చరించామని వర్ల రామయ్య పేర్కొన్నారు. అయినా పోలీసు వ్యవస్థ పనితీరులో మార్పులేదని..అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందనడానికి అనేక ఉదాహరణలున్నాయని ఆయన తెలిపారు.
ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మా నడవడిక బాగుందని చెప్పుకోవడంలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (ysrcp mlc ananthababu) తన దళిత డ్రైవర్‌ని చంపి కారులో తీసుకొచ్చి మృతుడి ఇంటిముందర పడేసి వెళ్లాడంటే అతడికి ఎంత ధైర్యమని వర్ల రామయ్య ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ గురించి కించిత్తు కూడా ఆలోచించకుండా పెళ్లిళ్లకు, పేరంటాలకు తిరుగుతుంటే ఏమనాలని ఆయన నిలదీశారు. పోలీసులు అతన్ని ఇంటరాగేట్ చేయాల్సిందని.. మా పోలీసేకదా, నన్నేం చేస్తారు అనే ధీమాతో అనంతబాబు వ్యవహరించారని రామయ్య మండిపడ్డారు. ఈ రోజునుంచైనా మేం చట్టప్రకారం నడుస్తామని, . మా విద్యుక్త ధర్మాన్ని మేం చక్కగా నిర్వర్తిస్తామని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
శిరీషను అలాగే చేస్తాం, అనంతబాబును ఇలాగే చేస్తామని చెప్పగలరా? ఎందుకింత దిగజారి వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హేళన చేయాలని అనుకోవడం లేదని... మీ బాధ్యతలను మీకు గుర్తు చేయాలనేదే తమ తపన అన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీజీపీకి ఉందని.. అడిషనల్ డీఐజీ, సీఐడీకి ఉందని వర్ల రామయ్య పేర్కొన్నారు. బాబాయి హత్య కేసులో (ys viveka case) ముద్దాయిలను వెలికితీయడానికి జాప్యం జరగడానికి లోకల్ పోలీసులే కారణమని ఆయన ఆరోపించారు. సీబీఐకి సహాయ నిరాకరణ చేస్తున్నారని.. వివేకాను చంపిందెవరో పెద్దలకు తెలుసునని రామయ్య వ్యాఖ్యానించారు.
కడప జిల్లాతో పాటు యావత్ రాష్ట్రం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గగ్గోలు పెడుతోందన్నారు. నాడు పరిటాల రవి హత్యకేసులో ముద్దాయిలైన మొద్దుశీను, డాక్టర్ సాంబశివరావు, ఓంప్రకాశ్, పటోళ్ల గోవర్థన్ రెడ్డి చనిపోయినట్లే నేడు బాబాయి హత్య కేసులో శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి, గోవర్థన్ రెడ్డి చనిపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిల మరణంలో ఉన్న అదృశ్య హస్తమే ఇప్పుడు బాబాయి హత్య కేసులో చనిపోయినవారిపై ఉందా అని రామయ్య నిలదీశారు. ఈ మరణాలు చూస్తుంటే ఇది కూడా ఆ కేసులాగే అయిపోతుందన్నారు. ఆ కేసులో ముద్దాయిలను గుర్తించారని.. కానీ ఇందులో ముద్దాయిలను గుర్తించే అవకాశం కూడా లేకుండా చేశారని రామయ్య ఆరోపించారు.
పరిటాల రవిని చంపిన వ్యక్తులే బాబాయిని చంపారా అనే అనుమానం కలుగుతోందని.. డీజీపీ తనకు పూర్తి బాధ్యతలు లేవంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల్ని హింసించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఉన్నట్లుగా సీఐడీ ఉన్నట్లు తోస్తోందని.. అధికార పార్టీకి రాజకీయ లబ్ది చేకూర్చడం కోసం ఉన్నట్లుందన్నారు. పోలీసు అధికారులు మీ పోస్టింగుల కోసం రాజకీయ నాయకుల కాళ్లకింద పడొద్దని...ట్రాన్స్ ఫర్స్ వస్తాయని భయపడొద్దని రామయ్య హితవు పలికారు. దళితులపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ యాక్టు పెట్టిన ఘనత ఈ రాష్ట్ర పోలీసులకే దక్కిందన్నారు.
పోలీసు స్టేషన్ లో ఓ దళితుడికి శిరోముండనం జరిగిన కేసును దర్యాప్తు చేయాలని.. పోలీసు వ్యవస్థ ఉనికిని పోగొట్టొద్దని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్‌ని వర్ల రామయ్య కోరారు. ఏపీ పోలీసు వ్యవస్థకు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్కాట్ లాండ్ యాడ్ దృష్టిలో కూడా మంచి పేరుందన్నారు. పోలీసు వ్యవస్థ చట్టాలకు అనుగుణంగా పనిచేయాలని.. వారం రోజుల్లో అనేక ఫిర్యాదులు ఇచ్చామని, కానీ ఒక్క ఫిర్యాదును కూడా స్వీకరించలేదని రామయ్య ఆరోపించారు. స్వయంగా తాను 27 ఫిర్యాదులు ఇచ్చానని... చర్యలు లేకపోవడం మమ్మల్ని అవహేళన చేయడానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
సీబీఐనే బెదిరించడం హాస్యాస్పదమని.. జగన్ నేతృత్వంలో నడుస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. డీఐజీ, ఇతర సీనియర్ అధికారులు గుండెపై చేయివేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. సీబీఐ డ్రైవర్‌ని ‘‘ నువ్వు కనిపిస్తే బాంబులు వేస్తాం’’ అని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు జరగకూడదనే ఆలోచన ముఖ్యమంత్రిదో? విజయసాయిరెడ్డిదో, డీజీపీదో అర్థం కావడంలేదన్నారు. వైసీపీ గూండాలకు భయపడి పల్నాడు జిల్లా ఆత్మకూరు నుంచి వలస వెళ్లిన మాదిగ కులస్థులు ఇంకా పూర్తిగా ఆ గ్రామానికి చేరుకోలేదని వర్ల రామయ్య తెలిపారు.
