Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ లో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం... ఈ అంశాలపైనే చర్చ

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆన్ లైన్ లో గురువారం సాయంత్రం నిర్వహించారు. 

TDP Politburo Meeting through Video Conference
Author
Guntur, First Published Jun 4, 2020, 9:55 PM IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆన్ లైన్ లో గురువారం సాయంత్రం నిర్వహించారు. దేశంలో, రెండు రాష్ట్రాలలో ఏడాది పరిపాలన, కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజి, విద్యుత్ రంగం సవరణ చట్టం, వన్ నేషన్ –వన్ అగ్రికల్చర్ మార్కెట్, ఉభయ రాష్ట్రాల్లో కరోనాపై పోలిట్ బ్యూరోలో చర్చించారు. 

సమావేశంలో చర్చించిన అంశాలు: 

1) టిడిపి సంస్థాగత నిర్మాణం: నెలకు ఒకసారి పోలిట్ బ్యూరో, అభ్యర్దులతో 15రోజులకోసారి, ప్రజాప్రతినిధులతో నెలకోసారి, మండల పార్టీ అధ్యక్షులతో నెలకోసారి, 3నెలల కోసారి గ్రామ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం. పెండింగ్ కమిటీలు వేసుకోవడం, నియోజకవర్గ ఇన్ చార్జ్ ల నియామకం, ప్రతి జిల్లాలో పొలిటికల్ కోఆర్డినేషన్ కమిటి నియామకం, రాష్ట్ర కార్యవర్గం నియామకం, అనుబంధ సంస్థలకు కమిటీల నియామకం..
రాబోయే కాలంలో పార్టీ కమిటీలలో యువతకు పెద్దపీట వేయాలి. పోరాటం చేసేవాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. బిసి, ఎస్సీ,ఎస్టీ,మైనారిటిలలో నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. 

2) ఆన్ లైన్ లో టిడిపి వర్య్మవల్ మహానాడు నిర్వహణ యునీక్ గా జరిగింది.  22తీర్మానాలపై జరిగిన చర్చలో 55మంది నాయకులు మాట్లాడారు. లక్షా 35వేల మంది వెబినార్ ద్వారా హాజరు కావడం ఒక రికార్డు. ఏడాది పాలనలో ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తెచ్చారు.  లాక్ డౌన్ నేపథ్యంలో కూడా మహానాడు విజయవంతం చేయడం అభినందనీయం.   లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే ప్రజా సమస్యలపై స్పందించడం, పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పార్టీ తెలుగుదేశమే. 

3) కరోనా బెడద రోజురోజుకూ తీవ్రతరం. ఏపిలో, తెలంగాణలో కోవిడ్ వైరస్ పెరిగిపోతోంది. ఏపిలో ఒకవైపు కరోనా బెడద..మరోవైపు వైసిపి బెడద..అడకత్తెరలో పోకచక్కల్లా ఉంది ప్రజల పరిస్థితి..రెండింటి మధ్య ఏపి ప్రజలు నలిగి పోతున్నారు. ఏపిలో గుంటూరు మార్కెట్ మరో కోయంబేడు మార్కెట్ గా మారింది. అన్ని పట్టణాలలో మార్కెట్ లపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కరోనా నేపథ్యంలో సమాజంలో మొత్తంగా అనిశ్చితి ఉంది. ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితి ఉంది. ఏవిధంగా మారుతుందో చెప్పలేని స్థితి. ఆర్ధిక వ్యవస్థ ఏమవుతుందో అగమ్యగోచరం. 

కరోనా సెకండ్ వేవ్ రావచ్చని అంటున్నారు. ఇప్పటికే ఎకానమి పూర్తిగా కొలాప్స్ అయ్యింది. సెకండ్ వేవ్ వస్తే మైనస్ 10%కు చేరే అవకాశం ఉంది. కేంద్రం రూ20లక్షల ప్యాకేజి ప్రకటించింది. ఎంఎస్ ఎంఈ లకు పాలసీ ఇచ్చింది. ప్రజలకు మరింత చేయూత పెంచాల్సివుంది. కేంద్రం ‘‘వన్ నేషన్- వన్ అగ్రికల్చర్ మార్కెట్’’ తెచ్చింది.  రైతులు పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించడం అభినందనీయం. పిపిఏల సమీక్ష పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకాల వల్లే దేశవ్యాప్తంగా విద్యుత్ చట్టానికి కేంద్రం సవరణలు చేసే పరిస్థితి  వచ్చింది.

read more  మరో సచివాలయ ఉద్యోగికి కరోనా... అధికారుల తీరుపై జగన్ అసంతృప్తి

4) ‘‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్’’ పేరుతో వైసిపి ఏడాది అరాచకాలపై 9వీడియోలు రోజుకొకటి చొప్పున విడుదల చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నాం. -ప్రభుత్వ భవనాలకు రంగుల విషయంలో మూర్ఖంగా వ్యవహరించారు.  హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులను కూడా లెక్కచేయని స్థితికి చేరారు. హైకోర్టు తీర్పుపై  సుప్రీంకోర్టుకు వెళ్లడం, మళ్లీ హైకోర్టుకు రావడం, అక్కడ 2జీవోలను కొట్టేసినా, ధిక్కరణ కేసు నమోదు చేస్తామని హెచ్చరించినా,మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడం, అక్కడా చుక్కెదురు కావడం, ఇప్పుడు రెండు కోర్టులలో ధిక్కరణ ఎదుర్కోవడం రాష్ట్రంలో వైసిపి నిర్వాకాలకు అద్దం పడుతోంది. 

రంగులు వేసిన డబ్బు, రంగులు తీసే డబ్బు మొత్తం వైసిపి నుంచే వసూలు చేయాలి. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు పొడిచారు. ఏకపక్షంగా ఎలక్షన్ కమిషనర్ ను తొలగించారు. శాసన మండలి రద్దు చేసే కుట్రలు పన్నారు. బ్యూరోక్రసీని భ్రష్టు పట్టించారు. మీడియాపై దాడులకు తెగబడ్డారు. వైసిపి ఏడాది పాలనలో విచ్చలవిడిగా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. ఇళ్లజాగాలు ఇస్తామని చెప్పి పేదల నుంచి వసూళ్లు. భూసేకరణలో స్కామ్ లు, మెరక చేయడంలో స్కామ్ లు..ఆవ భూముల్లో రూ400కోట్ల స్కామ్.

ఇళ్లస్థలాల్లో వసూళ్లు-భూ కుంభకోణాలు: రూ7లక్షల విలువైన భూమిని రూ 45 లక్షల నుంచి రూ70లక్షలకు కొంటున్నారు. 3రెట్లు ధర చెల్లించినా రూ 21లక్షలు చెల్లించాల్సిన భూమిని దానికి మూడు నాలుగు రెట్లు చెల్లించి వైసిపి నాయకులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. పల్లపు భూములు సేకరించి, మెరక వేయాలంటూ మళ్లీ దోపిడి చేస్తున్నారు. ‘‘పేరు పేదలది, మేసేది వైసిపి..’’ పేదల సంక్షేమాన్ని కూడా వైసిపి గద్దలే స్వాహా చేస్తున్నాయి. ఏడాదిలోనే ఇంత అవినీతికి పాల్పడ్డారంటే రాబోయే 4ఏళ్లలో ఏ స్థాయిలో దోపిడి ఉంటుందో ఆలోచిస్తేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 

ఇసుక మాఫియా అరాచకాలు:   ఇసుక రీచ్ లలో తవ్వినదానికి, స్టాక్ యార్డు నిల్వలకు పొంతన లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 12లక్షల టన్నుల ఇసుక దారిమళ్లిందని, దాదాపు 55% అక్రమాలు జరిగాయని వెల్లడైంది.ఏడాది గడిచినా ఇప్పటికీ గ్రామాల్లో ఇసుక దొరకడం లేదు, గ్రామాల్లో అన్ని పనులు ఆగిపోయాయి. కార్మికుల ఉపాధి పోయింది. ఎక్కడి ఇసుక అక్కడ విక్రయించకుండా, వేరే జిల్లాలకు తరలించి లారీ రూ 50 వేలు, 70వేలకు అమ్ముతున్నారు.  

మద్యం ధరలు విచ్చలవిడిగా పెంచేశారు. నాసిరకం మద్యం అమ్ముతున్నారు. అందుకే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ధరలు భరించలేక స్పిరిట్ తాగే దుస్థితి కల్పించారు. స్పిరిట్ తాగి 7గురు చనిపోవడం వైసిపి నిర్వాకాలకు పరాకాష్ట. వైసిపి నాయకుల అండదండలతో పొరుగు రాష్టాల నుంచి యధేచ్చగా అక్రమ మద్యం రవాణా చేస్తున్నారు. నాటు సారా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. 

5)పేదల సంక్షేమానికి తూట్లు:  వైసిపి చెప్పేదానికి, ఆచరణలో జరిగేదానికి చాలా తేడా ఉంది. సామాన్యులకు ప్రభుత్వ లబ్ది అందే పరిస్థితి లేదు. అనేక నిబంధనలు, ఆంక్షలతో సంక్షేమానికి కోతలు పెట్టారు. ప్రభుత్వం ఇచ్చే రూ10వేలకే ఇన్ని నిబంధనలు పెట్టి తమకు రావాల్సిన లబ్ది కూడా అడ్డుకుంటున్నారని ఆటో డ్రెవర్లు, దర్జీలలో ఆవేదన ఉంది. 
6లక్షల మంది డ్రైవర్లు ఉంటే అందులో 2వంతుల మందికి ఎగ్గొట్టి అందరినీ ఉద్దరించినట్లుగా గొప్పలు చెబుతున్నారు. ఆటో డ్రెవర్లకు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ జరిమానాల కింద రెండింతలు వసూలు చేస్తున్నారు. 

ఇటీవల విడుదల చేసిన వడ్డీ రాయితీ కూడా రెండు మూడు వందల రూపాయలు మాత్రమే వచ్చిందని మహిళలే నిందిస్తున్నారు. 10 లక్షలపైగా ఇళ్ల నిర్మాణం టిడిపి పూర్తి చేసింది. మరో 12లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. లబ్దిదారులకు ఇళ్లు స్వాధీనం చేయకుండా వేధిస్తున్నారు. పట్టణాల్లో 2-3లక్షల ఇళ్లకు పెండింగ్ బకాయిలు చెల్లించకుండా క్షోభ పెడుతున్నారు.

read more   చేనేత కార్మికుల కోసం ప్రత్యేక సర్వే... కీలక అంశాలపై ఆరా: మేకపాటి ప్రకటన

6) రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం చేశారు. రూ 87వేల కోట్ల అప్పులు చేశారు. రూ50వేల కోట్ల భారాలు వేశారు. ఏ ఒక్క అభివృద్ది పని చేపట్టలేదు. పేదల సంక్షేమానికి కోతలు పెట్టారు. వైసిపి చేతగాని పాలన, అవినీతి అరాచకాల దుష్పలితాలకు ప్రజలే బలి అవుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి మానవ తప్పిదమే అని గ్రీన్ ట్రిబ్యునల్ నిపుణుల కమిటి చెప్పింది. 14మంది మృతికి, వందలాది మంది అస్వస్థతకు కారణమైన కంపెనీని ముఖ్యమంత్రి, మంత్రులు వత్తాసు పలకడం హేయం. 

7) ఏడాదిలో 800మంది టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు, అనేకమంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. 8మంది హత్యలు, 7గురు ఆత్మహత్యలు, 225బిసి కుటుంబాలను, 42మైనారిటీలు, 78దళిత కుటుంబాలు, 11ఎస్టీలు, 228మంది ఓసి కుటుంబాలపై వైసిపి గుండాలు దాడులు చేశారు. ఈ రోజు కూడా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో మామిడి చెట్లను నరికేశారు. గతంలో దానిమ్మ చెట్లు, కొబ్బరి, చీనీ చెట్లు నరికేశారు, బోర్లు ధ్వంసం చేశారు. 

8)  దళితులపై దాడులు, దౌర్జన్యాలు పేట్రేగిపోయాయి. విశాఖలో డాక్టర్ సుధాకర్ రావు పై అమానుషం, మాజీ ఎంపి హర్షకుమార్ , రాజేష్ తదితరులను జైళ్లకు పంపడం, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు. వైసిపి అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ‘‘దళితులకు టాలెంట్ లేదు కాబట్టి సలహాదారుల పదవులు ఇవ్వలేదని’’ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలే దళితుల పట్ల వైసిపి చిన్నచూపుకు నిదర్శనం. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్, ఉపప్రధానిగా చేసిన జగ్జీవన్ రామ్, లోక్ సభ స్పీకర్లుగా చేసిన బాలయోగి, మీరాకుమార్ తదితరులు వైసిపి కళ్లకు కనిపించడం లేదా..? 

9) ‘‘జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాడ్ అని, చెప్పేదంతా  బోగస్ అని’’ వైసిపి నాయకులే చెబుతున్నారు. ‘‘ఏడాది పాలనలో రూపాయి అభివృద్ది చేయలేదని’’ ఒక వైసిపి ఎమ్మెల్యేనే చెప్పారు. ‘‘రీచ్ నుంచి స్టాక్ పాయింట్ కు రాకుండానే ఇసుక లారీలు మాయం అవుతున్నాయని’’ ఇంకో వైసిపి ఎమ్మెల్యే అన్నారు. ‘‘ఇళ్లస్థలాలకు పేదల నుంచే బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని’’ వైసిపి ఎంపి చెప్పారు. ‘‘నాటు సారా తయారీ యదేచ్ఛగా జరుగుతోందని’’ శాసన సభాపతే తెలిపారు. ‘‘రిజర్వాయర్ లో నీళ్లు వైసిపి నాయకులే అమ్ముకుంటున్నారని’’ నెల్లూరు జిల్లా వైసిపి ఎమ్మెల్యేలే చెప్పారు. 

తెలంగాణ ప్రజా సమస్యలపై చర్చ: 

తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ,  తెలంగాణలో టిడిపి కార్యక్రమాలను వివరించారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి చేపట్టిన ఆందోళనలను ప్రస్తావించారు. మహానాడు చర్చల్లో తెలంగాణలో రైతుల సమస్యలు. నీటి పారుదల ప్రాజెక్టుల, విద్యా వైద్య రంగాల్లో వైఫల్యంపై ప్రజల దృష్టికి తీసుకెళ్లాం అన్నారు. తెలంగాణలో 6ఏళ్లలో 6వైఫల్యాలు, ప్రధాన హామీలు బుట్టదాఖలు. 3ఎకరాల భూమి, లక్ష ఉద్యోగాలు, ముస్లింలకు, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు, ప్రాజెక్టులపై నిర్లక్ష్యం తదితరాలపై ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లుగా చెప్పారు. 

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘గత 12నెలల్లో ప్రజా సమస్యలు 55 అంశాలపై టిడిపి శ్రేణుల ఆందోళనలు విజయవంతం అయ్యాయి.ఏడాది పాలనలో ఏపిలో జరిగినంత ఇంత విధ్వంసం ఎక్కడా జరగలేదు, ప్రజల్లో ఇంత వ్యతిరేకత చూడలేదు. వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు, పేదల సంక్షేమాన్ని కాలరాశారు, అభివృద్దిని ధ్వంసం చేశారు, అరాచకం సృష్టించారు అన్నివర్గాల ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ’’ ధ్వజమెత్తారు.

‘‘ఇళ్ల స్థలాల్లో అవినీతి-అక్రమాలు, ల్యాండ్ స్కామ్ లు-వసూళ్ల దందాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు వెల్లడించాలి. కార్పోరేషన్ల నిధుల దారిమళ్లింపుపై బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను చైతన్యపరచాలి. రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. రెండు రాష్ట్రాలలో ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో ఆందోళనలు ముమ్మరం చేయాలని’’ చంద్రబాబు పేర్కొన్నారు. 

ఈ భేటిలో యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతి రాజు, ప్రతిభాభారతి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారా లోకేష్ , అచ్చెన్నాయుడు, గల్లా అరుణ కుమారి, నిమ్మకాయల చిన రాజప్ప, కాలువ శ్రీనివాసులు, గల్లా జయదేవ్, కాలువ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios