అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. జగన్ పై సీబీఐ కేసుల విచారణ నత్తనడకన సాగుతోంది అంటూ ధ్వజమెత్తారు.  

ముఖ్యమంత్రి జగన్ పై 2012 లో సీబీఐ 11 ఛార్జ్ షీట్లు వేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి విచారణను త్వరతిగతిన పూర్తి చేయాలంటూ తాము 2014 లో పిల్ వేసినట్లు చెప్పుకొచ్చారు.   

అయితే ఈ కేసుల్లో ఉన్న ముద్దాయిలు విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. 11 కేసుల్లో సీఎం జగన్ ముద్దాయి అంటూ చెప్పుకొచ్చారు. ఆస్తుల కేసుకు సంబంధించి విచారణను కోర్టుల్లో జరగకుండా జగన్ అడ్డుపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ముఖ్యమంత్రిగా పాలన అందించాలనే సాకుతో జగన్ శుక్రవారం కోర్టుకు హాజరు కావడం లేదని విమర్శించారు. కేంద్రమాజీమంత్రి చిదంబరం కేసులో సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించిందన్న విషయాన్ని వర్ల రామయ్య గుర్తు చేశారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం గా ఉన్నపుడు లబ్దిపొందిన వ్యక్తులు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనడానికి అన్ని ఆధారాలు సీబీఐ వద్ద ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పత్రికలకు సంబంధం లేని నిమ్మగడ్డ ప్రసాద్ సాక్షి పత్రికలో రూ. 834 కోట్లు పెట్టుబడులు పెట్టారని చెప్పుకొచ్చారు. 

సీఎం జగన్ సీబీఐ కోర్టు హాజరణకు ప్రతీ శుక్రవారం హాజరై సహకరించాలని డిమాండ్ చేశారు. ఇకపై ప్రతీ శుక్రవారం తప్పని సరిగా సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సిందేనని హెచ్చరించారు. ఈ కేసు విచారణ వేగవంతం చేసి త్వరగా తేల్చాలంటూ పట్టుబట్టారు. 

మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఆరోపించారు. అలాగే మంత్రి కొడాలి నాని టీటీడీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని వర్ల రామయ్య నిలరదీశారు.