ఈ మూడేళ్ల వైసిపి పాలనపై వెయ్యి నేరాలు-వెయ్యి ఘోరాలు పేరుతో ప్రతిపక్ష టిడిపి బుక్ లెట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి (ysrcp) ప్రభుత్వ పాలన వెయ్యిరోజులకు చేరుకున్న సందర్బంగా ప్రతిపక్ష టిడిపి (tdp) ''వెయ్యినేరాలు-వెయ్యి ఘోరాలు'' ప్రజాఛార్జ్ షీట్ పేరుతో బుక్ లెట్ విడుదలచేసింది. ఈ బుక్ లెట్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నేతలు వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ (ys jagan) పై విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి మూడేళ్లపాలన ప్రజలకు, రాష్ట్రానికి ఎవరూపూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని అన్నారు. విధ్వంసంతో మొదలైన జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడేవరకు ప్రజలంతా కసితో, పట్టుదలతో ఈ ప్రభుత్వంపై పోరాడాలని టిడిపి పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (atchannaidu) మాట్లాడుతూ... వ్యవస్థల విధ్వంసం, ప్రజల దోపిడీ, రాజ్యాంగ ఉల్లంఘనలతో కేవలం మూడేళ్లలోనే జగన్ రెడ్డి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని దుర్మార్గాలు, దురాగతాలు చేశాడని మండిపడ్డారు. ఈ వెయ్యిరోజుల పాలనలో ఈ ముఖ్యమంత్రి చేసిన ఘోరాలు, విధ్వంసాలు, నేరాలు, లూఠీలు, అబద్ధాలకు అంతేలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

''వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెయ్యిరోజుల్లో చేస్తున్న దుర్మార్గాలు, నేరాలు,ఘోరాలను ప్రతిరోజూ ప్రజలకు చెబుతూనే ఉంది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ. అయినప్పటికీ వాటన్నింటినీ మరోసారి ఏపీ ప్రజలకు, విజ్ఞులకు,మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు, రాష్ట్రభవిష్యత్ బాగుండాలని కాంక్షించేవారికి తెలియచేయడానికే వెయ్యిరోజుల్లో వెయ్యి ఘోరాలు, నేరాలు పేరుతో బుక్ లెట్ విడుదల చేశాము'' అని పేర్కొన్నారు.

''చరిత్రను పరిశీలిస్తే పేదవారైనా, ధనవంతులైనా శుభకార్యాలను ప్రారంభించేటప్పుడు మంచిపనితో ప్రారంభిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయికాగానే అశుభకార్యంతో పాలన ప్రారంభించాడు. ప్రజలందరూ ప్రభుత్వ అధిపతిని కలిసి, వారి సమస్యలు చెప్పుకోవడం కోసం గతంలో చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని ఈ ముఖ్యమంత్రి కూల్చేశాడు. ఆ విధంగా అధికారం చేపట్టిచేపట్టగానే అశుభకార్యంతో జగన్ రెడ్డి పాలన ప్రారంభించాడు. అప్పుడే రాష్ట్రం దివాళా తీస్తుందని, ఏపీ సర్వనాశనమైపోయి ప్రజలంతా విలపిస్తారని తాము అనుకున్నాం. కానీ తాము అనుకున్నదానికంటే దారుణంగా జగన్ రెడ్డి మూడేళ్ల పాలన సాగింది'' అంటూ అచ్చెన్న ఎద్దేవా చేసారు. 

''ప్రజావేదిక కూల్చివేత అవగానే అమరావతిని ధ్వంసం చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలని నేనో లేక చంద్రబాబో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. ఐదుకోట్లమంది ప్రజల అభిప్రాయాలతో పాటు, ఆనాడు శాసనసభలో ఉన్న అన్నిపార్టీల అభిప్రాయాలను తీసుకున్నాకే అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. రాజధాని నిర్మించాలంటే డబ్బుకావాలి... కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దానికితోడు రెవెన్యూలోటు. దాన్ని అధిగమించేలా చంద్రబాబు తన ఆలోచనావిధానంతో రైతులను మెప్పించి, ఒప్పించి వారినుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో 34వేల ఎకరాలవరకు సేకరించారు. ప్రభుత్వం పైసా ఇవ్వకపోయినా రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించి, చంద్రబాబుపై నమ్మకంతో రైతులు ప్రాణసమానమైన భూముల్ని రాష్ట్రంకోసం ఇచ్చేశారు'' అని అచ్చెన్న తెలిపారు. 

''హైదరాబాద్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నాకూడా మనరాష్ట్రంలోనే మనం ఉండాలన్న ఒక సదుద్దేశంతో ఆనాడు చంద్రబాబు అమరావతి కేంద్రంగా ప్రభుత్వనిర్వహణ చేపట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే అమరావతిని విచ్ఛిన్నం చేశాడు. అక్కడ ఏం పనిచేసినా అది చంద్రబాబుకే పేరుప్రఖ్యాతులు కలిగిస్తుందన్న అక్కసుతో అమరావతిని సర్వనాశనం చేయడానికి మూర్ఖుడైన జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు'' అని మండిపడ్డారు. 

''మూడు రాజధానులంటూ సీఎం జగన్ మూడు ప్రాంతాలమధ్య చిచ్చు పెట్టాడు. ఎవరూ అడగకుండానే, ఆఖరికి తన మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా సంప్రదించకుండా మూడు రాజధానుల పేరుతో అమరావతిని చంపేశాడు. జగన్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం వల్ల 139కి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇతరప్రాంతాలకు పారిపోయాయి'' అన్నారు. 

''అమరావతిని ఒక కులానికి, ప్రాంతానికి ఆపాదించి అవగాహన లేకుండా దుష్ప్రచారం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టి వారిదారికి తెచ్చుకోవాలన్న పాలకులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదే అమరావతి పూర్తయితే 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందేవి. స్వాతంత్ర్యభారతంలో గానీ, రాష్ట్ర చరిత్రలోగానీ ఎన్నడూ లేనివిధంగా మత విద్వేషాలకు జగన్ రెడ్డి ఆజ్యం పోశాడు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటివరకు దాదాపు 220కుపైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. లెక్కకుమిక్కిలి విగ్రహాల విధ్వంసాలు జరిగాయి. విజయనగరంలో రామతీర్థంలో రాముల వారి తలను ధ్వంసంచేస్తే దానికి కారకులైనవారిని ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ శిక్షించలేకపోయాడు. అది ఆయన అసమర్థతకాదా?'' అని ప్రశ్నించారు. 

''తెలుగురాష్ట్రాల చరిత్రలో ఎన్నడైనా ఒక రాజకీయపార్టీ కార్యాలయంపై దాడి జరిగిందా? జగన్ రెడ్డి అండతో పోలీసుల సాయంతో కొందరు దుర్మార్గులు టీడీపీ కార్యాలయంపై దాడిచేసి అక్కడి సిబ్బంది తలలు పగులగొట్టారు..అడ్డొచ్చారన్న అక్కసుతో కాళ్లుచేతులు విరిచేశారు. ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉంటుందా? సాక్షాత్తూ వైసీపీశాసనసభ్యుడే వీధిరౌడీలా మారి, గూండాలను వెంటేసుకొని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి వెళ్లాడు. జడ్ ప్లస్ కేటగరి భధ్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి వైసీపీ శాసనసభ్యుడు దాడికి వెళ్తే ఈ ముఖ్యమంత్రి శభాష్ అంటూ అతనిభుజం తట్టాడు. అదేనా ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి చేయాల్సినపని'' అంటూ మండిపడ్డారు. 

''ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యాసౌరభాలు వెదజల్లుతున్న ప్రఖ్యాత విద్యాసంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయంపై దాడిచేశారు. తక్కువ ఖర్చుతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం గీతం విశ్వవిద్యాలయం చేసిన తప్పా? సదరు విశ్వవిద్యాలయం వారు టీడీపీలో ఉంటే దాన్నికూల్చేస్తారా?'' అని అచ్చెన్న నిలదీసారు. 

''తాడేపల్లిలో రాజప్రాసాదం నిర్మించుకున్న జగన్ రెడ్డి, తనచుట్టూ పేదలుఉండకూడదన్న అక్కసుతో వారి గుడిసెలను తొలగించాడు. పేదలు ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఉండకూడదా? వారేమైనా ఉగ్రవాదులా? టెర్రరిస్టులా?'' అంటూ అచ్చెన్నాయుడు సీఎం జగన్ వెయ్యిరోజుల పాలనపై విరుచుకుపడ్డారు.