అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి తొలివిడత జాబితాను రూపొందిచినట్లు ప్రచారం జరుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంట్ స్థానాలకు గానూ 9 స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం మినహా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ కె. రామ్మోహన్ నాయుడును బరిలోకి దించాలని చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి కె.రామ్మోహన్ నాయుడును ఎంపిక చేశారు. అటు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పోటీ చెయ్యనున్నారు. 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు పూసపాటి అశోక్ గజపతిరాజు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. 2014లో విజయనగరం ఎంపీగా పోటీ చేసిన ఆయన 2019లో మళ్లీ పోటీ చేస్తున్నారు. 

ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాలకు గానూ రెండింటిని  పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ ను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. 

కృష్ణా జిల్లా విషయానికి వస్తే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని బరిలోకి దించనున్నారు. కడప జిల్లాలో కడప పార్లమెంట్ అభ్యర్థిగా మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చెయ్యనున్నారు. అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మళ్లీ గల్లా జయదేవ్ పోటీ చెయ్యనున్నారు.  

కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. అదే  జిల్లాలో నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

అటు ప్రకాశం జిల్లా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా శ్రీరామ్ మాల్యాద్రి
 తిరిగి పోటీ చేయనున్నారు. మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల కసరత్తు కూడా దాదాపు  పూర్తైందని ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు వారిని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఆ నేపథ్యంలో గెలుపు గుర్రాలనే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలని పక్కా వ్యూహంతో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని ప్రధానమంత్రి ఎవరో అన్నది తానే నిర్ణయించాలని చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.