Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి ఇంత అరాచకమా.... ఆరేళ్ల చిన్నారిని కూడా వదిలిపెట్టరా...?: డిజిపికి చంద్రబాబు లేఖ

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను వైసిపి ఆదేశాలతో పోలీసులు వేధిస్తున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు డిజిపి గౌతమ్ సవాంగ్ కు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

TDP National President Chandrababu Writen Letter to AP DGP Sawang
Author
Amaravati, First Published Sep 8, 2021, 9:45 AM IST

అమరావతి: అధికార వైసిపి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలా పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లే ప్రకాశం జిల్లా లింగసముద్రంలో ఇద్దరు టిడిపి కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హాస్పిటల్ పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు డిజిపి గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. 

''ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు వైసీపీ నేతల ఆదేశాలతో మొగిలిచర్లకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించి వేధిస్తున్నారు. ఇలా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో  ఆరేళ్లు, పదేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. పి.రత్తయ్య, ఎం.శ్రీకాంత్ అనే కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు'' అని పేర్కొన్నారు. 

''టీడీపీని వీడాలంటూ కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి అర్థరాత్రి 2 గంటల వరకు స్టేషన్లోనే వుంచుకుని వదిలిపెట్టారు. మళ్లీ ఉదయాన్నే 6.30 గంటలకు లింగసముద్రం ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించారు. ఇలా పోలీసుల బెదిరింపులు తట్టుకోలేక రత్తయ్య, శ్రీకాంత్ అనే ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

read more  జస్టిస్ కనగరాజ్ కు మరో షాక్: జగన్ ప్రభుత్వ నియామకంపై హైకోర్టులో పిల్

''రత్తయ్య, శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలియగానే మిగిలిన వారిని పోలీసులు హడావుడిగా స్టేషన్ నుండి పంపించారు. వారికి కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఈ సంఘటనతో రాష్ట్రంలో పోలీసుల వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది'' అంటూ చంద్రబాబు డిజిపి దృష్టికి తీసుకెళ్లారు.  

''రాష్ట్రంలోని కొంతమంది పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. వైసీపీ నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు పనిచేస్తున్నారు. రెండేళ్లలో పోలీసుల బెదిరింపులు తారాస్థాయికి చేరుకున్నాయి.  పోలీసులపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసం అగాధంలోకి వెల్లింది. రాష్ట్రంలో పోలీస్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది'' అన్నారు. 

''చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వహించాలి. లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణజరిపి చర్యలు తీసుకోవాలి. పక్షపాతం లేకుండా పోలీసులు విధులు నిర్వహించేలా ఆధేశించాలి'' అని తన లేఖ ద్వారా డిజిపిని కోరారు చంద్రబాబు నాయుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios