Asianet News TeluguAsianet News Telugu

రైల్వేజోన్ పై కదం తొక్కిన టీడీపీ ఎంపీలు

 టీడీపీ ఎంపీలు రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ భేటీ గందరగోళంగా జరిగింది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరించారు టీడీపీ ఎంపీలు. 

Tdp mps meets with railway gm vinod kumar yadav
Author
Vijayawada, First Published Sep 25, 2018, 3:00 PM IST

విజయవాడ: టీడీపీ ఎంపీలు రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ భేటీ గందరగోళంగా జరిగింది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరించారు టీడీపీ ఎంపీలు. 

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్‌ అంశంపై జీఎం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఎంపీలు సమావేశం మధ్యలోనే బయటకు వచ్చి తమ నిరసన తెలియజేశారు. రైల్వే శిక్షణ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వేజోన్‌ అంశంపై కేంద్రం మోసం చేస్తోందని టీడీపీ ఎంపీ మాగంటి బాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ అంశంపై అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, వైసీపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు రైల్వే జోన్ ప్రకటిస్తారా అంటూ మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక అని దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలిపారు. 

ఏపీలో నాలుగు డివిజన్లు ఉన్నా రైల్వేజోన్ ఎందుకు ఇవ్వడం లేదని రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ ఆరోపించారు. సమావేశంలో టీడీపీ ఎంపీలంతా రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిపారు. రైల్వే జోన్ అంశం పునర్విభజన చట్టంలోని హామీ అని దాన్ని తప్పక నెరవేరాల్సిన బాధ్యత కేంద్రానిదేనని విజయవాడ ఎంపీ కేశినేని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలోని హామీలను సాధించుతీరుతామని తెలిపారు. 

గత నాలుగున్నరేళ్లలో రైల్వేకు సంబంధించి అనేక సమస్యలు జీఎం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎలాంటి పరిష్కారం లేదని అందువల్ల తాము సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. 

మరోవైపు ఎంపీలంతా కొత్త రైల్వే జోన్ పై డిమాండ్ చేశారని వారి అభిప్రాయాలను కేంద్రం, రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తానని దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ తెలిపారు. ఏపీలో రైల్వేకు సంబంధించి అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోందని, జోన్ పరిధిలో ఆరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, కర్నూలు స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయని, వచ్చే ఏడాది మార్చికల్లా పనులు కొలిక్కి వస్తాయని స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు సహకరించడంతోనే రైల్వే ప్రాజెక్టులు, మౌలిక వసతులు కల్పన వేగంగా జరుగుతోందన్నారు. మరో మూడేళ్లలో గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులు పూర్తి అవుతాయని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 142 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. 

అమరావతికి రైల్వే అనుసంధానంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ముందుగా సింగిల్ లైన్ 85 కిలోమీటర్ల మేర వేయనున్నట్లు తెలిపారు. రైల్వే బోర్డు నుంచి నిధుల కోసం లేఖ రాశామని, అవసరాన్ని బట్టి రెండో లైన్ నిర్మాణం కూడా చేపడతామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios