అమరావతి: కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లాతో టీడీపీ ఎంపీలు మంగళవారం నాడు భేటీ అయ్యారు.టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీందర్ కుమార్ లు అజయ్ భల్లాతో సమావేశమయ్యారు. 

రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు, అధికారులను పనిచేయనీయకుండా బెదిరింపులు, న్యాయ వ్యవస్థపై దాడుల గురించి అజయ్ భల్లాకు  వివరించామని టీడీపీ ఎంపీలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచక పాలన గురించి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర హోం సెక్రటరీకి తెలియజేశామన్నారు. 

 ఇప్పటికే కొన్ని విషయాలపై అవగాహన ఉందని మరికొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. సంబంధిత శాఖల ద్వారా సమాచారం తీసుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలియజేస్తామని హామీ ఇచ్చారని ఎంపీలు తెలిపారు. 

అలాగే కొంతమంది పోలీస్ అధికారులు సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశామన్నారు.తమ ఫిర్యాదులను సానుకూలంగా విన్న అజయ్ భల్లా.. వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీలు చెప్పారు.