గురువారం బెంగళూరులో విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ జారీ చేసిన సమన్లపై టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. తనకు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని.. అసలు ఆ కంపెనీ గురించి తనకు ఏమాత్రం తెలియదని పేర్కొన్నారు.

సుజనా గ్రూప్ పేరిట లిస్ట్ అయిన యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, స్ల్పెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, న్యూయాన్ టవర్స్ లిమిటెడ్ కంపెనీల్లో తాను 2003 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మాత్రమే కొనసాగానని సుజనా స్పష్టం చేశారు.

అక్టోబర్ 2014 వరకు ఈ కంపెనీల్లో ఏ విధమైన యాజమాన్య బాధ్యతలు నిర్వర్తించలేదన్నారు. అక్టోబర్ తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో కూడా కొనసాగలేదన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే.

2010-13లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్‌లను మోసగించేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడటంతో సదరు బ్యాంక్‌లకు రూ.364 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇయనపై ఇప్పటికే డీఆర్ఐ, ఫెమా, సీబీఐ కేసులున్నాయి.