శ్రీకాకుళం: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం పాటు పడుతుంటే వైఎస్ జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని విమర్శించారు. 

తిత్లీ తుఫాన్ సమయంలో కనీసం పరామర్శించడానికి కూడా రాని నాయకులు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలు చాలా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

టిక్కెట్ దక్కకుంటే పార్టీలు మారిపోయే నాయకులు ప్రస్తుత రాజకీయాల్లో కనిపిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతర శ్రామికుడిగా చంద్రబాబు పనిచేస్తున్నారని కొనియాడారు. 

అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. రైతుల కళ్లల్లో సంతోషం చూడాలనే రుణమాఫీ, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

వృద్దులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో పింఛన్లు రెట్టింపు చేశామని తెలిపారు. ఆడపడుచులకు పెద్ద దిక్కుగా ఉండాలన్న లక్ష్యంతో పసుపు-కుంకుమ పథకం ద్వారా రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.