తెలుగుదేశం పార్టీ నాయకుడికి మద్దతుగా అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నాారు.
శ్రీకాకుళం : ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటిముందు రోడ్డును ధ్వంసంచేయడానికి ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సాగునీటి కాలువపై కల్వర్టు అక్రమంగా నిర్మించారంటూ అధికారులు తొలగించే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో పాటు భారీగా టిడిపి నాయకులు, కార్యకర్తలు అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పలాస కాశీబుగ్గలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... పలాస పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు తన ఇంటికి వెళ్ళే దారిలో పదిహేనేళ్ల క్రితం కల్వర్టు నిర్మించుకున్నాడు. అయితే సాగునీటి కాలువపై నిర్మించిన ఈ కల్వర్టు అక్రమమంటూ ఇటీవల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీటిప్రవాహానికి అడ్డంకిగా మారుతోందంటూ కల్వర్టును కూల్చివేసేందుకు సిద్దమయ్యారు. శనివారం అర్ధరాత్రి కూల్చివేత సామాగ్రితో అధికారులు కల్వర్టు వద్దకు చేరుకోవడం ఉద్రిక్తత దారితీసింది.
టిడిపి నాయకుడు నాగరాజును ఇబ్బంది పెట్టడానికే కల్వర్టును కూల్చివేస్తున్నారని... అధికార వైసిపి నాయకులు కక్షపూరితంగానే ఇలా చేయిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. నాగరాజుకు మద్దతుగా అర్ధరాత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష లతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కల్వర్టు కూల్చివేతను అడ్డుకుంటూ రోడ్డుపై బైఠాయించారు. పోలీస్ బలగాలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
కల్వర్టు కూల్చివేత విషయంలో అధికారులు, టిడిపి నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వెంటనే పోలీసులు టిడిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అధికారులు కల్వర్టు కూల్చివేత చేపట్టారు.
అయితే మంత్రి సిదిరి అప్పలరాజు ఆదేశాలతోనే అధికారులు తన ఇంటికి దారిలేకుండా చేస్తున్నారని టిడిపి నేత నాగరాజు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాననే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని నాగరాజు ఆందోళన వ్యక్తంచేసారు.
