టీడీపీ వీడేది లేదు.. మూడోసారి బెజవాడ నుంచే, ఎంపీగా గెలుస్తా : పార్టీ మార్పుపై తేల్చేసిన కేశినేని నాని
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ తాను టీడీపీ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ తాను టీడీపీ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. హ్యాట్రిక్ విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెడతానని నాని ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల గురించి అధిష్టానం చూసుకుంటుందని.. రాజకీయాల్లో ప్రజాసేవ ముఖ్యమన్న ఆయన, పదవులు వాటంతట అవే వస్తాయని ఎంపీ పేర్కొన్నారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులపై నాని మాట్లాడుతూ.. దేశంలో నిజాయితీ వున్న అతికొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒకరని ప్రశంసించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ లేదని.. చంద్రబాబు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇవ్వడం చాలా సాధారణమైన విషయమన్నారు.
Also Read: వైసిపి నుండి ఆహ్వానం అందింది... వారితో టచ్ లో వున్నా..: కేశినేని నాని సంచలనం
కాగా.. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని వ్యవహారతీరు ఆ పార్టీని తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇప్పటికే పార్టీకి అంటీముట్టనట్లు వుంటున్న ఆయన అధికార వైసిపి నాయకులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు వైసిపి నాయకులు కూడా ఎంపీ నాని పనితీరు అద్భుతమంటూ మాట్లాడుతున్నారు. దీంతో విజయవాడ ఎంపీ నాని వైసిపి పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
టిడిపి వీడటం లేదని అంటూనే తాను అన్ని పార్టీలతో టచ్ లో వుంటానని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికార వైసిపితోనే కాదు బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలతోనూ టచ్ లో వుంటానని అన్నారు. పార్టీల తరపున కాకుండా తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల తరపున అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అన్నారు. ప్రజల కోసమే వైసిపి ఎమ్మెల్యేలతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నానని నాని స్పష్టం చేసారు.