ఏపీ, తెలంగాణల మధ్య విభజన సమస్యలపై ఈ నెల 17న జరగనున్న త్రిసభ్య కమిటీ భేటీ ఎజెండాలో మార్పులు చోటు చేసుకోవడంపై కనకమేడల స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రత్యేక హోదా విషయం అడుగుతూనే ఉంటామని అన్నారు తప్ప చిత్తశుద్ధితో పోరాటం చేయలేదు అని కనకమేడల విమర్శించారు.
కేంద్రంతో వైసీపీ లాలూచీ పడటం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం అజెండా నుంచి తొలగించారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (kanakamedala ravindra kumar) ఆరోపించారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఈనెల 17న జరగనున్న సమావేశానికి అజెండాలో పెట్టించాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణల మధ్య విభజన సమస్యలపై ఈ నెల 17న జరగనున్న త్రిసభ్య కమిటీ భేటీ ఎజెండాలో మార్పులు చోటు చేసుకోవడంపై కనకమేడల స్పందించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని రవీంద్ర కుమార్ గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చిందని హోదా విషయం పక్కన పెట్టేశారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రత్యేక హోదా విషయం అడుగుతూనే ఉంటామని అన్నారు తప్ప చిత్తశుద్ధితో పోరాటం చేయలేదు అని కనకమేడల విమర్శించారు.
అంతకుముందు ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే (ysrcp) జోగి రమేష్ (jogi ramesh) స్పందించారు. సీఎం జగన్‌తోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని స్పష్టం చేశారు. ఎజెండాలో ప్రత్యేకహోదా చేర్చి... మళ్లీ తొలగించడాన్ని ఖండిస్తున్నానని జోగి రమేశ్ అన్నారు. చంద్రబాబు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్‌లు ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన ఫైర్ అయ్యారు. వీళ్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎజెండాలో సవరణలకు కారణమయ్యారని.. హోంశాఖ ఎజెండా నుంచి ప్రత్యేకహోదా తొలగించడం దారుణమని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండాలో ప్రత్యేకహోదా అంశం లేదని జీవీఎల్ ప్రకటన చేశారని ఆయన అన్నారు.
అంబటి రాంబాబు కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఎందుకు మారిందని ఆయన ప్రశ్నించారు. త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకొచ్చిన 9 అంశాలను మార్చాలని జీవీఎల్ ప్రకటన చేశారని అంబటి మండిపడ్డారు. ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే.. జీవీఎల్ ఎందుకంత హడావిడి పడ్డారని ఆయన దుయ్యబట్టారు. దీనిపై జీవీఎల్ నరసింహారావు (gvl narasimha rao) వివరణ ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎజెండాలో ప్రత్యేక హోదా వుండటాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదని రాంబాబు నిలదీశారు. సుజనా చౌదరి (sujana chowdary) , సీఎం రమేశ్‌లు చంద్రబాబు ఆదేశాలతోనే ఎజెండాను మార్పించారని స్పష్టం అవుతోందని అంబటి రాంబాబు ఆరోపించారు.
