వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలంటూ వైసీపీ నేతలకు సీఎం జగన్ క్లాస్ పీకడంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఫైరయ్యారు. వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలు లేవనెత్తిన సందేహాలకు జగన్ సమాధానం చెప్పలేకపోయారని ఆయన చురకలు వేశారు.
వైసీపీపైనా , సీఎం వైఎస్ జగన్‌పైనా మండిపడ్డారు టీడీపీ (tdp) ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (kanakamedala ravindra kumar) . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మీద తిరగబడమని సీఎం జగన్ తన ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలు అడిగిన ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానాలే చెప్పలేకపోయారని రవీంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన వర్క్ షాప్‌లో భాగంగా ప్రజల మీద తిరగబడేలా ఎమ్మెల్యేలను జగన్ రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.
వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలు లేవనెత్తిన సందేహాలకు జగన్ సమాధానం చెప్పలేకపోయారని కనకమేడల దుయ్యబట్టారు. టీడీపీ ఇటీవలే నిర్వహించిన మహానాడుకు ఊహించని స్పందన లభించిందని... దానిని చూసి వైసీపీలో భయం మొదలైందని చరకలు వేశారు. ఈ భయంతోనే వైసీపీ వర్క్ షాప్‌ను నిర్వహించిందని కూడా ఆయన ఎద్దేవా చేశారు. పార్టీని కాపాడుకోవడానికే జగన్ వర్క్ షాప్‌లు, ప్లీనరీలు అంటూ సాగుతున్నారని రవీంద్ర కుమార్ దుయ్యబట్టారు.
Also Read:వైసీపీ 175 స్థానాల్లో గెలిస్తే .. టీడీపీ ఆఫీస్‌కి తాళం వేస్తాం: జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్
ఇకపోతే.. గడప-గడపకు కార్యక్రమంపై (gadapa gadapaku mana prabhutvam) సీఎం వైఎస్ జగన్ (ys jagan) సమక్షంలో ఐప్యాక్ టీం (ipac team) బుధవారం ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పని తీరుపై తెలియజేసింది. ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు నిర్వహించారన్న దానిపై ప్రజంటేషన్‌లో ప్రస్తావించారు. 10, 5 రోజుల కంటే తక్కువ గడప- గడపకు నిర్వహించిన వారిపై ఐప్యాక్ నివేదిక ఇచ్చింది. ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలు వున్నట్లు తెలిపిందింది. ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనని వారిలో బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వున్నారు.
అనంతరం ఈ నివేదికపై సమావేశంలోనే స్పందించారు సీఎం జగన్. మొదటి నెల కావడంతో వదిలేస్తున్నానని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని సూచించారు. 6 నెలల వరకు ఎమ్మెల్యేలపై పర్యవేక్షణ ఉంటుందని జగన్ అన్నారు. 6 నెలల తరువాత నివేదికను బట్టి చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. మరోవైపు.. క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం జగన్‌కు పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.
