తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాల్సిందిగా తమ పార్టీ ఎంపీలు చేయడం దురదృష్టకరమన్నారు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరడం మోడ్ ఆఫ్ ది నేషనా అని ప్రశ్నించారు.

ఇవాళ ఉదయం సమీక్షా సమావేశంలో ఆ నలుగురు ఎంపీలు సైతం పాల్గొన్నారని కనకమేడల గుర్తు చేశారు. 37 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు గెలిచి 4 సార్లు ఓడిపోయామన్నారు. ఓడిపోయిన పార్టీలు అంతరించిపోవాలా.. ఇదేనా మోడీ ఆలోచన అని రవీంద్రకుమార్ ప్రశ్నించారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగలేదని.. తమను ఎవరు సమావేశానికి పిలవలేదని, చట్ట ప్రకారం ఎంపీల విలీనం జరగలేదన్నారు. అది విలీనం కాదని.. ఫిరాయింపు కిందకు వస్తుందని కనకమేడల తెలిపారు.

ఓడిపోయినప్పుడు పార్టీని మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ మూసేయలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, బాబు ప్లాన్‌లో భాగంగానే ఎంపీలను బీజేపీలోకి పంపుతున్నారన్న వ్యాఖ్యలను రవీంద్రకుమార్ ఖండించారు. పార్టీ కార్యకర్తలు ఆధైర్యపడవలసిన అవసరం లేదని కనకమేడల తెలిపారు.