కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కోసం ఇచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ . 

కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కోసం ఇచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ . గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైందని.. ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే.. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని కనకమేడల సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే లక్షా 46 కోట్లు అప్పు చేసిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని రవీంద్ర కుమార్ మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా... తప్పుడు కేసులతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని... గత ప్రభుత్వ హయాంలోనే 69 నుంచి 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పోలవరం పనులను నిలిపివేసిందని కనకమేడల మండిపడ్డారు.

దీని వల్ల ఏడాది కాలం వృథా అవ్వడమే గాక.. రైతులు ఒక పంటను కోల్పోయారని రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని నిధులివ్వడంతో పాటు, కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.