ఆవేశంలో మాట్లాడినా ఒక్కోసారి టిడిపి అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి నిజాలు మాట్లాడేస్తుంటారు. తాజాగా ఇపుడు కూడా అదే జరిగింది. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో జెసి మాట్లాడుతూ, రాష్ట్రంలో మెజారిటి రెడ్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని చెప్పారు. జగన్ కారణంగానే రాష్ట్రలో రెడ్లకు విలువే లేకుండా పోయిందని వాపోయారు. ‘ఎవరు అంగీకరించినా,  అంగీకరించకపోయినా , వద్దనుకున్నా రెడ్లంతా జగన్ వైపే ఉన్నారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

అందుకనే రెడ్లను ఇతర కులాల వాళ్ళు గౌరవించటం మానేసారని కూడా చెప్పారు. రెడ్లు జగన్ వైపు నిలబడటానికి, ఇతర కులాల వాళ్ళు గౌరవించక పోవటానికి ఏమి సంబంధమో జెసినే చెప్పాలి. అదే సందర్భంలో ‘రెడ్ల తోకను ఇలాంటి వాళ్ళు కోసేశారు’ అంటూ పక్కనే ఉన్న టిడిపి ఎంఎల్సీ కరణం బలరాంను చూపారు. రాజకీయాల్లో తన అవసరం లేదని, 2019లో రిటైర్ అవుతానని స్పష్టంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున అనంతపురం ఎంపి స్ధానంలో పోటీ చేయటానికి జెసి కుమారుడు పవన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో రెడ్ల మద్దతు కూడగట్టేందుకు చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్న సమయంలో జెసి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది.

అంతటితో ఆపితే ఆయన జెసి ఎందుకవుతారు? మంత్రుల గురించి మాట్లాడుతూ, ప్రస్తుత మంత్రివర్గాల్లో ఎవరికీ వెన్నెముక లేదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో ఏ మంత్రి మాటా చెల్లుబాటు కావటం లేదని చెప్పారు. మంత్రుల మాట చెల్లుబాటు కావటమన్నది తమ కాలంలోనే అయిపోయిందన్నారు.