అమరావతి:అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 40 శాతం టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను మారిస్తే కానీ చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని తేల్చి చెప్పారు. ఇప్పటి నుంచే చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు చెయ్యాలంటూ సూచించారు.

మరోవైపు ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కలిసి పని చేస్తారని తాను భావించడం లేదని తెలిపారు. జగన్-పవన్ లాంటి భిన్న ధృవాలన్నారు. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు వారు పోటీ చేసే స్థానాల్లో మాత్రమే గెలుస్తారే తప్ప తమ అభ్యర్థులను గెలిపించుకోలేరన్నారు. కానీ జగన్ మోదీల మనస్తత్వం మాత్రం ఒకటేనని తెలిపారు. తాడిపత్రి ఘటనలో పోలీసుల వైఫల్యంపై డీజీపీకి మంగళవారం ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

రాష్ట్రంలో ఐటీ దాడులతో ప్రధాని మోదీ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ జగన్ ల మనస్తత్వం ఒక్కటే. పాతకక్షలు మనసులో పెట్టుకుని మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తిత్లీ తుఫాన్ బాధితులను బీజేపీ నాయకులు పరామర్శించలేదని గుర్తు చేశారు.