రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికే ఏపి సీఎం చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుగు దేశం పార్టీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెంటపడుతున్నాడని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ ని ప్రధాని చేసి తద్వారా ఏపికి ప్రత్యేక హోదా పొందాలని చంద్రబాబు భావిస్తున్నట్లు కనిపిస్తోందని జెసి తెలిపారు. 

కానీ తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కోరిక నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కేంద్ర రాజకీయాలను శాసించడం, దేశాన్ని మార్చడం రాహుల్ కు చేతకాదంటూ జెసి కాస్త  ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎలూరు ఎంపీ మాగంటి బాబు నిరాహార దీక్షకు దిగారు. ఆయనకు ఎపి  టిడిపి ఎంపీలంతా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబు-రాహుల్ లపై పైవిధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నంత కాలం ఎపి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని జెసి హామీ ఇచ్చారు. మోదీ ఓ నియంతలా వ్యయవహరిస్తూ ఏపిపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడని...అందువల్లే రైల్వే జోన్ ను కూడా ఇవ్వడం లేదన్నారు. అయితే ఈ  రైల్వేజోన్‌ వల్ల ఏపీకి, ప్రభుత్వానికి లాభం కానీ, నష్టం కానీ లేదని జేసి వెల్లడించారు.