అమిత్ షా పై దాడి.. ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ నేత

First Published 14, May 2018, 2:57 PM IST
tdp mlc rajendraprasad shock to bjp leaders
Highlights

బీజేపీ, టీడీపీ నేతలకు దిమ్మతిరిగిపోయింది.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయిపై రాళ్ల దాడి కేసులో టీడీపీ నేత ఒకరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.  ఇటీవల అమిత్ షా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయనకు హోదా సెగ తగలింది. టీడీపీ కార్యకర్తలు అలిపిరిలో ఆయన వాహనాన్ని అడుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాన్వాయిపై రాళ్ల  దాడి కూడా జరిగింది. కాగా.. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబే స్వయంగా దగ్గరుండి మరీ ఈ దాడి చేయించారంటూ వాళ్లు ఆరోపణలు కూడా చేశారు. 

అయితే.. ఈ ఘటనపై తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలను ఇటు బీజేపీతోపాటు సొంత పార్టీ నేతలు కూడా ఖంగుతిన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆ పార్టీ నేత కోలా ఆనంద్, అతని అనుచరులే దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. అసలు దాడి ఆలోచన ఉంటే అమిత్ షా కాన్వాయ్‌నే అడ్డుకునే వాళ్లం అని అన్నారు. ఇదే విషయమై సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్.. ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగానే నిరసన తెలిపారన్నారు. అలిపిరి ఘటనపై రాజకీయం చేయడం తగదన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ భారతీయ జగన్ పార్టీగా తయారైందని విమర్శించారు.

కాగా.. టీడీపీ నేత ఆరోపణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా పార్టీ జాతీయ అధ్యక్షుడిపై సొంత పార్టీ నేతలు దాడి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపించినా కాస్త నమ్మసక్యంగా ఉండేదని పలువురు వాపోతున్నారు. అయినా.. అమిత్ షా కాన్వాయిపై రాళ్ల దాడి జరగడాన్ని మీడియా ఛానెళ్లు అన్నీ కవర్ చేశాయి.. అలాంటప్పుడు ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

loader