అమరావతి: కడపలో ఉక్కు ఫ్యాక్టరీని తామే అడ్డుకొంటున్నామని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్  డిమాండ్ చేశారు.  

సోమవారం  నాడు ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏ ఆధారంతో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తోంటే, ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు కాకుండా తమ పార్టీయే అడ్డుకొందని  చెప్పడం విడ్డూరంగా ఉందని రాజేంద్రప్రసాద్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో  ఆయన తన స్థాయిని దిగజార్చుకొన్నారని  రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకొందని బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. దమ్ముంటే పోలవరంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

అధిష్టానం మెప్పు కోసమే బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  బీజేపీ, వైసీపీలు, జనసేలు  కుట్రలకు పాల్పడుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మూడు పార్టీల కుట్రలను ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.