Asianet News Telugu

అశోక గజపతి రాజు మేరు పర్వతం...విజయసాయి అవినీతి అనకొండ: టిడిపి ఎమ్మెల్సీ మంతెన

అశోక్ గజపతిరాజు గురించి ఎంపి విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని... వారి వ్యవహారం చూస్తే దొంగే దొంగా...దొంగా...అని అరిచి గోలచేసినట్లుగా ఉందని మంతెన ఎద్దేవా చేశారు. 

TDP MLC Manthena Satyanarayana raju fires on vijayasai reddy and vellampalli akp
Author
Visakhapatnam, First Published Jun 18, 2021, 10:02 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తిరిగి అశోక్ గజపతి రాజును నియమిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే తీర్పునిచ్చిందని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు తెలిపారు. కానీ అశోక్ గజపతిరాజు దొడ్డిదారిన చైర్మన్ అయ్యారంటూ ఎంపి విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని... వారి వ్యవహారం చూస్తే దొంగే దొంగా...దొంగా...అని అరిచి గోలచేసినట్లుగా ఉందని మంతెన ఎద్దేవా చేశారు. 

''దేశచరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అడ్డగోలు అవినీతికి తెరతీపి 16నెలలు జైలు జీవితం గడిపి 18 సిబిఐ, ఈడి కేసుల్లో ఎ2గా ఉన్న విజయసాయిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు. దొడ్డిదారిన రాజ్యసభకు వెళ్లడమేగాక ఉత్తరాంధ్రకు సామంతరాజుగా ఉండి యావత్ అధికార యంత్రాంగాన్ని అనధికారికంగా గుప్పెట్లో పెట్టుకొని వేలకోట్ల భూకుంభకోణాలకు పాల్పడుతున్నారు'' అని ఆరోపించారు. 

''ఇక విజయవాడ కనకదుర్గమ్మ గుడిని నిలువుదోపిడీ దోచేసిన చరిత్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ది. ఆయన వార్డుమెంబర్ కు ఎక్కువ, కౌన్సిలర్ కు తక్కువ. అశోక్ గజపతి కాలిగోటికి కూడా వెల్లంపల్లి సరిపోడు.  అశోక్ గజపతిరాజుకు అవినీతి మకిలీ అంటించడమంటే నిప్పుకు చెదపట్టిందని చెప్పడమే'' అన్నారు. 

''మేరు పర్వతం లాంటి అశోక్ గజపతిరాజుకు అవినీతి అనకొండగా పేరొందిన విజయసాయిరెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల విద్య, ఉపాధి అవకాశాల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వేలకోట్ల రూపాయల ఆస్తులను మాన్సాస్ ట్రస్ట్ కోసం త్యాగం చేసిన చరిత్ర అశోక్ గజపతి కుటుంబానిది. తమ విద్యాసంస్థల ద్వారా లక్షలాదిమంది పేద విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు'' అని మంతెన కొనియాడారు. 

read more  దోపిడిదారులకు మాన్సాస్ ట్రస్ట్‌లో స్థానం లేదు: ఆశోక్‌గజపతిరాజు

''మూడున్నర దశాబ్ధాలకు పైగా రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిత్వం ఆయన సొంతం. రాష్ట్రప్రయోజనాల కోసం కేంద్రమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేసిన అశోక్ గజపతిపై నీవంటి ఆర్థిక నేరగాళ్లు ఆరోపణలు చేయడాన్ని యావత్ ఉత్తరాంధ్ర ప్రజానీకం అసహ్యించుకుంటోంది. అశోక్ గజపతిని తిరిగి చైర్మన్ పదవిలో నియమిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేస్తే దొడ్డిదారిన పదవి తెచ్చుకున్నారని అనడం న్యాయవ్యవస్థను కించపర్చడమే. బహుశా రాజారెడ్డి రాజ్యాంగంలో న్యాయస్థానం ఉత్తర్వులు దొడ్డిదారి అని ఉండి ఉండొచ్చు...బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమైతే న్యాయస్థానం ఆదేశాలు అత్యున్నతమైనవి, విలువలతో కూడుకున్నవి'' అని పేర్కొన్నారు. 

''ఇప్పటికే 166 కేసుల్లో కోర్టుతో మొట్టికాయలు తిన్న మీకు గౌరవ హైకోర్టు ఆదేశాలు రుచించకపోవకపోవడం సహజమే. మాన్సాస్ ట్రస్ట్ అధీనంలో ఉన్న 14వేల ఎకరాల విలువైన భూములు, సింహాచలం అప్పన్నభూములు కొల్లగొట్టేందుకు విజయసాయి అండ్ కో వేసిన మాస్టర్ ప్లాన్ విఫలం కావడం వల్లే ఉక్రోషంతో అశోక్ గజపతిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అశోక్ గజపతి పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడైనప్పటికీ వేలకోట్ల ఆస్తులను ప్రజలకోసం దారపోసి సాధారణ జీవనాన్ని గడుపుతున్నారు'' అని తెలిపారు. 

''2004కు ముందు జగన్, విజయసాయిరెడ్డి ఆస్తులు ఎంత? ఇప్పడు ఎంత? వేలకోట్ల ఆస్తులు ఏవిధంగా కూడబెట్టారో దేశ ప్రజలందరికీ తెలుసు. ఇకనైనా పద్దతి మార్చుకొని ప్రజాస్వామ్య బద్ధంగా మెలగడానికి ప్రయత్నించండి. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజాకోర్టుతోపాటు భగవంతుడి కోర్టులో కూడా దోషులుగా నిలబడి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది'' అని టిడిపి ఎమ్మెల్సీ హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios