ప్రకాశం : ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆ నియోజకవర్గంలో నష్ట నివారణ చర్యలు చేపడుతున్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. 

టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. 

నెలరోజుల వ్యవధిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తెలుగుదేశం పార్టీ వీడి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల జాబితా చాంతాడంత ఉందంటూ ప్రచారం కూడా జరుగుతుంది. 

దీంతో టీడీపీ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి తరుణంలో టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన అనుచరులతో గురువారం భేటీ కావడం పెద్ద చర్చకు దారి తీసింది. మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత ఆరు నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

వాటికి ఊతమిచ్చేలా ఎమ్మెల్సీ అనుచరులతో సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నెల్లూరులోని తన కార్యాలయంలో సుమారు రెండు గంటలపాటు అనుచరులతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. 

ఒంగోలు లోక్ సభ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఈనెల 17న ఒంగోలులో తన నిర్ణయం ప్రకటిస్తానని అనుచరులకు స్పష్టం చేశారు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి. 

2014 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరఫున ఒంగోలు లోక్ సభకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట పోటీ చేస్తారని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించేశారు. 

ఇటీవల ఒంగోలులో జరిగిన ఒక సభలో తాను టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని తనను గెలిపించాలని కూడా మాగుంట విజ్ఞప్తి చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేతలు మాగుంటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తోంది. 

ఈ నేపథ్యంలో నెల్లూరులో ఆయన అనుచరులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీలలో పార్టీల బలబలాలపై ఆరా తీసినట్లు సమావేశానికి హాజరైన అనుచరులు చెప్తున్నారు. 

ఈ సమావేశం వ్యవహారం బయటకు పొక్కడంతో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. సమావేశానికి హాజరైన అనుచరులతో జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ లు భేటీ అయ్యారు. 

మీటింగ్ కు సంబంధించి ఆరా తీశారు. పార్టీ మారే అంశం ప్రస్తావనే రాలేదని మాగుంట శ్రీనివాసులరెడ్డి అనుచరులు చెప్పుకొచ్చారు. దీంతో నేతలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ మీటింగ్ యెుక్క ఆంతర్యం ఏంటనేది తెలియాలంటే ఈనెల 17 వరకు వేచి చూడాల్సిందే.