విజయవాడ తెలుగుదేశంలో ట్విట్టర్ వార్ ముదిరి పాకానపడింది. బెజవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తన లాంటి వారు కావాలనుకుంటే మీ లాంటి పెంపుడు కుక్కలను కంట్రోల్‌లో పెట్టుకోండి అంటూ కేశినేని చేసిన ట్వీట్‌కు బుద్ధా వెంకన్న కౌంటరిచ్చారు.

బలహీన వర్గాలకు చెందిన నాకు ఎమ్మెల్సీ పదవినిచ్చిన చంద్రబాబుకు తాను విశ్వాసపాత్రుడిననని.. దానికి నువ్వు ఏ పేరు పెట్టినా తనకు సమ్మతమేనని.. చంద్రబాబు కోసం, టీడీపీ కోసం ఈ ట్వీట్ల యుద్ధాన్ని ఆపేస్తున్నట్లు వెంకన్న ప్రకటించారు.

రెండు రోజుల నుంచి వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్ తారాస్థాయికి చేరగా.. సోమవారం ఉదయం నాని ఘాటుగా స్పందించారు. మీ పెంపుడు కుక్కలను కంట్రోల్ చేయండి.. లేదంటే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నేరుగా చంద్రబాబుకే గురిపెట్టి ట్వీట్ చేయడం ఆ తర్వాత కొద్ది గంటల్లోనే వెంకన్న ట్వీట్ చేయడం బెజవాడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.