వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్మోహనరెడ్డిపై 420 పేరుతో బయోపిక్ తీస్తే సూపర్‌హిట్ అవుతుందని సెటైర్లు వేశారు.

బీసీ గర్జన పేరుతో జగన్ నోటికొచ్చినట్లు హామీలు గుప్పించారని వెంకన్న విమర్శించారు. ప్రతిపక్షనేత ఇచ్చిన హామీలను చంద్రబాబు ఇప్పటికే అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. బాబు వస్తే సంక్షేమం.. జగన్ వస్తే ఏపీ స్మశానమవుతుందని బుద్దా ఎద్దేవా చేశారు.

పక్క రాష్ట్ర నేతలతో చేతలు కలిపిన జగన్.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని వెంకన్న మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలోనే బీసీల అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. కులాల వారీగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ఆర్ధికంగా చేయూతను అందిస్తున్నామని బుద్ధా వెంకన్న వెల్లడించారు.

జగన్ ఏనాడైనా బీసీల సమస్యలపై స్పందించారా అని ఆయన ప్రశ్నించారు. కొద్దిరోజుల్లో ఎన్నికలు వస్తున్నందునే బీసీలపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధినేతపై ఉన్న కేసులకు అసలు పోటీ చేసే అర్హత లేదని.. ఇతర దేశాల్లో అయితే ఊచలు లెక్కిస్తూ ఉండేవారని వెంకన్న ధ్వజమెత్తారు.