ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునులు, రుషులు చేసే యజ్ఞాన్ని రాక్షసులు భగ్నం చేసినట్లు.. ప్రజలంతా కరోనాపై చేస్తున్న యజ్ఞాన్ని తుగ్లక్ 2.0 భగ్నం చేస్తున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు.

దేశమంతా కరోనాతో గడగడలాడిపోతోందని.. గుళ్లూ, గోపురాలు, స్కూళ్లు, కాలేజీలు మూసి గత 45 రోజులుగా మహా యజ్ఞం చేస్తున్నారని బుద్ధా గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో జెట్యాక్స్ కోసం రెడ్ జోన్ ఉన్న ప్రాంతాల్లో కూడా మద్యం షాపుల్ని తెరిపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన పబ్జీ ముఖ్యమంత్రి.. ఇప్పుడు మద్యం షాపులు తెరిచి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. లాక్ డౌన్ తో నిత్యావసరాలు కూడా ఉదయం 9 లోగా తెచ్చుకోవాలన్నారని... కానీ మద్యం షాపులు రోజంతా తెరిచి ఉంచడం దుర్మార్గమని ఆయన అన్నారు.

Also Read:మద్యం దుకాణాల రీ ఓపెన్‌తో కరోనా వ్యాప్తి: చంద్రబాబు ఆందోళన

ఈ షాపుల ముందు కనీస భౌతిక దూరం లేకుండా ఉన్న కిలోమీటర్ల మేర ఉన్న క్యూలైన్లను చూస్తే భయమేస్తోందని బుద్ధా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారూ ఆ క్యూలైన్లను చూసైనా మద్యం షాపుల విషయంలో పునరాలోచన చేయండి అంటూ ఆయన కోరారు.

ఒక రైతు మార్కెట్ ధర కంటే ఎక్కువకు అమ్మితే కేసులు పెడతాం అన్నారు.. మరి మద్యం ధరలపై 25శాతం పెంచి అమ్ముతున్నారని వెంకన్న ధ్వజమెత్తారు. ఇది ప్రజలను దోచుకోవడం కాదా.? కరోనా విజృంభిస్తున్న వేళ మద్యం షాపుల్ని తెరిపించడమే మద్యనిషేధమా.? దక్షిణాధిలో ఏ రాష్ట్రంలో కూడా మద్యం షాపులు తెరవలేదని ఆయన దుయ్యబట్టారు.

పక్కనున్న తెలంగాణలో అయితే మద్యం షాపులు తెరిచే ప్రశక్తేలేదని ముఖ్యమంత్రి ప్రకటించారని..  కానీ మనరాష్ట్రంలో మద్యం షాపులు తెరవడం ద్వారా ప్రజల ప్రాణాలపై, వారి ఆస్తులపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతోందన్నారు.

కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకుంటున్న వారికి నెలన్నరగా ఉపాధి లేదని.. ఇప్పుడు మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనుకోవడం పేదలను దోచుకోవడమేనని బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

మహిళల పుస్తెలు కాపాడేందుకు మద్య నిషేధం అమలు చేస్తానన్న జగన్..  నేడు వారి పుస్తెలు తెంచే మద్యం షాపులు తెరవడం.? ఏంటని ఆయన నిలదీశారు. నిన్నటి వరకు మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు బహిరంగ సభలు, సమావేశాలు పెట్టి కరోనాను వ్యాపింపజేశారని.. దీనిని జగన్ మరో దశకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

Also Read:ఎన్టీఆర్ విధానాన్ని కొనసాగించి వుంటే.. ఈ పరిస్ధితి ఉండేదా: బాబుపై ధర్మాన వ్యాఖ్యలు

కరోనా నియంత్రణ వదలి... వైరస్ వ్యాప్తికి పాటు పడటం చూస్తుంటే సిగ్గేస్తోందని, మీ కమిషన్ల కోసం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు.? అని బుద్ధా ప్రశ్నించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మద్యం షాపులు తెరవాల్సిన అవసరం ఏమిటని ఆయన నిలదీశారు.

లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా మద్యానికి దూరంగా ఉన్నారని, సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడానికి అవకాశం వస్తే.. దాన్ని జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలపైకి తీసుకొచ్చారని బుద్ధా ఫైరయ్యారు.

పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అగ్నిగుడం చేశారని.. ఇప్పటికైనా మేలుకోకుంటే దేవుళ్లే దిగి వచ్చినా ఆపడం కష్టమన్నారు. వెంటనే మద్యం షాపుల్ని మూసివేయాలని.. మీకు ఓటేసిన ప్రజల ప్రాణాలను కాపాడాలని బుద్ధా వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు.