టీడీపీలో 20 నుంచి 30 మందికి సీటు రాదనే విషయం తెలుసుకున్న వాళ్లు పార్టీని మారుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన నేతలు పార్టీలు మారినప్పుడు కులాల ప్రస్తావన మంచిది కాదని సూచించారు.

ఆమంచి ఏడాదిన్నరపాటు టీడీపీ చుట్టూ తిరిగి పార్టీలో చేరారని వెంకన్న గుర్తు చేశారు. లోటస్ పాండ్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అవంతి శ్రీనివాస్ చదివారని ఆయన ఎద్దేవా చేశారు. కులాలను గురించి మాట్లాడిన నేతలను, అన్ని కులాలు కలిసి చిత్తుగా ఓడించాలని బుద్ధా పిలుపునిచ్చారు.

ఇటీవల చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. అనంతరం ఒక కులం వారికే తెలుగుదేశంలో ప్రాధాన్యతనిస్తున్నారని... అన్ని ఉన్నత పదవుల్లో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారంటూ ఆరోపించారు.