ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్వాగతించారు.  ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని  జగన్ పేర్కొనగా... అది మంచి నిర్ణయమని.. తాను స్వాగతిస్తున్నానని బుద్ధా  వెంకన్న తెలిపారు.

అనంతరం అధికార పార్టీ చేస్తున్న పలు విమర్శలపై కూడా ఆయన స్పందించారు.  పోలవరం గురించి కనీసం సమీక్ష కూడా చేయకుండా పనితీరును ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు.  టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలన్నీంటినీ తొలగించినా.. తాము ఏం మాట్లాడలేదని గుర్తు చేశారు.

కొత్త ప్రభుత్వ పనితీరును కొంతకాలం పరిశీలించాలని తాము భావించినట్లు ఆయన చెప్పారు. వైసీపీ నేతలు అనవసరంగా నోరు పారేసుకుంటే... తాము కూడా అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం ప్రతిపక్ష సభ్యులకు సమాచారం ఇవ్వడం సంప్రదాయమన్నారు. కానీ సంఖ్యా బలం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. చంద్రబాబును తప్పు పడితే ఎలా అని నిలదీశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు.‌ కానీ ఎవరి మర్యాదను వారు కాపాడుకుంటే మంచిదని సూచించారు.