విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య ట్విట్టర్ లో వేదికగా పొలిటికల్ వార్ నడుస్తోంది. గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. 

తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు ఎమమెల్సీ బుద్దా వెంకన్న. క్విడ్‌ ప్రొ కోకి మరో పేరు రివర్స్‌ టెండరింగ్‌ అని పెట్టావా శకుని మామా? అంటూ సెటైర్లు వేశారు. 

 మీ మహామేత చేతగాని తనం వలన పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరిగి రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో చర్చకు తాను సిద్ధం. నువ్వు సిద్ధమా? అంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్‌ విసిరారు. 

విద్యుత్‌ పీపీఏల విషయంలో మీ విచిత్ర వేషాలు ఆపాలని కేంద్రం, కోర్టులు ఛీకొట్టినా నీకు సిగ్గు రాదా శకుని మామా? అంటూ విజయసాయిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రజాధనం గురించి విజయసాయిరెడ్డి మాట్లాడ్డం టెర్రరిస్టు శాంతి వచనాలు పలికినట్లుందని అభిప్రాయపడ్డారు. 

పీపీఏలు, పోలవరం, అమరావతి ఇలా నువ్వు వేలుపెట్టిన ప్రతిదాంట్లో మీ దొంగబ్బాయికి షాక్‌ కొడుతోందని హెచ్చరించారు. గ్రామ సచివాలయం పేపర్లు లీక్ అయ్యాయని పదేపదే ఆరోపించారు. 

పేపర్‌ లీక్‌ అవ్వలేదు అంటున్న దొంగ లెక్కల మాస్టారుకి చిన్న ప్రశ్న. గ్రామ సచివాలయం పరీక్ష ఎవరు నిర్వహించారు? లీక్‌ అవ్వలేదని ట్వీట్‌ పెట్టిన మొనగాడు విచారణకి ఎందుకు భయపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

విచారణకి సిద్ధమని ఒక ట్వీట్‌ వదులు శకుని మామా. ఎవరు సొల్లు స్టోరీలు చెబుతున్నారో తేలిపోద్ది అంటూ విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. మరి బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.