కడప జిల్లా మామిళ్లపల్లె గనుల పేలుడు ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావట్లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు దోషులను వదిలేయాలని చూస్తున్నారా అని రవి ఫైరయ్యారు.

ఈ గనుల అసలు లీజుదారుగా వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరు ఉందని బీటెక్‌ రవి చెప్పారు. 2001 నుంచి 2022 వరకు లీజు పరిమితి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గని యజమానిగా పేర్కొన్న నాగేశ్వర్‌రెడ్డిపై చాలా కేసులున్నాయని.. గతంలోనూ ఆయన చాలాసార్లు జైలుకెళ్లి వచ్చారని రవి ఆరోపించారు.

గనిని నాగేశ్వర్‌రెడ్డికి సబ్‌ లీజుకు ఇచ్చారా? ఇచ్చినట్లు సృష్టించారా? అని ఆయన నిలదీశారు.  అనుమతి లేకుండా రూ.100 కోట్ల విలువైన సామగ్రిని తరలించారని బీటెక్‌ రవి ఆరోపించారు.

Also Read:మామిళ్లపల్లి పేలుడు కేసు: జగన్ కుటుంబంలో అరెస్ట్ కలకలం.. పోలీసుల అదుపులో వైఎస్ ప్రతాపరెడ్డి

రామచంద్రయ్య కుటుంబసభ్యుల జోలికి వెళ్లొద్దని ఆదేశాలిచ్చారా? అని పోలీసులను ప్రశ్నించారు. పేలుళ్ల ఘటనకు రామచంద్రయ్య, ఆయన సతీమణే కారణమని.. వారిపై చర్యలు తీసుకోకపోతే టీడీపీ తరఫున కోర్టులో ప్రైవేట్‌ కేసు వేస్తామని బీటెక్ రవి హెచ్చరించారు. 

కాగా, మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కుటుంబానికి చెందిన వైఎస్ ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.

అనంతరం మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్లు కడప జిల్లా ఎస్పీ తెలిపారు. గనిలో వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.