ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఓ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారంటూ  టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం విజయవాడలో మీడియా  సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. కొత్త ప్రభుత్వం లేనిపోని హడావిడి చేస్తోందని విమర్శించారు.

జగన్ ఆలోచనా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రశ్నార్థకంగా మారిందని.. పోలవరం దగ్గర సముద్రంలో కలిసే నీరు తీసుకోకుండా, కొత్త విధానాలు మాట్లాడుతున్నారన్నారు.

పదివేల కోట్ల రూపాయలతో అవినీతి చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. దొంగ మాదిరి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణకు లక్ష యాభైవేలు కోట్లు ఖర్చుపెడితే... ఏపీకి ఒరిగేది ఏమీ లేదన్నారు. ప్రభుత్వం అర్థరహితంగా వాదిస్తోందని.. పోలవరంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన కేసు ఇంకా అలానే ఉందని గుర్తు చేశారు. 

కేసీఆర్ తో చీకటి ఒప్పందం చేసుకొని నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు. పోలవరం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇలాగే ఉంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు మీకు కనిపించడం లేదన్నారు. 

తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను మూసివేశారని మండిపడ్డారు. సీఎం జగన్ మద్యపాన నిషేధం అంటూ ఎనిమిదివేల కోట్లు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.