గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై వైయస్ జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

రాష్ట్రంలో అవినీతి రాజ్యానికి రారాజు వైయస్ జగన్మోహన్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. అలాంటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.  

అర్బన్ హౌసింగ్ స్కీమ్ లో భారీ అవకతవకలు జరిగాయని రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలంటూ వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. అవినీతి అంటూ లేనిపోని అసత్యాలు చెప్పి రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సిగ్గు చేటన్నారు. 

హసింగ్ విషయంలో షేర్ వాల్ టెక్నాలజీ సరైనది కాదని వైసీపీ చెప్పగలదా అని సూటిగా ప్రశ్నించారు. పేదలు పురాతన ఇళ్లల్లోనే ఉండాలని జగన్ కోరుకుంటున్నారా అంటూ నిలదీశారు. 

పేదవాళ్లు కొత్త ఇళ్లు నిర్మించుకుని వారు అందులో నివాసం ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. పేదవాళ్ళను చులకనగా చూడొద్దని వైయస్ జగన్ కు హితవు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని పదేపదే చెప్తున్న సీఎం వైయస్ జగన్ గతంలో ఆయన తండ్రి తలపెట్టిన రాజీవ్ గృహాకల్పపై కూడా విచారణ చేస్తే బాగుంటుందన్నారు. గృహనిర్మాణ శాఖలో అవినీతిపై 2004 నుంచి 2019 వరకు విచారణ చేస్తే తాము స్వాగతిస్తామని ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు.