గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు.  

ఉద్యోగులకు గత ప్రభుత్వం 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 27 శాతం మధ్యంతరభృతి ఇస్తామని వైయస్ జగన్ చెప్పారని గుర్తు చఏశారు. 

ఆనాడు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామన్న జగన్ నేడు మాట తప్పారని విమర్శించారు. జులై నుంచి 27 శాతం ఐఆర్ చెల్లిస్తానని ప్రకటించడం దారుణమన్నారు. ఏప్రిల్ నుంచి జులై మధ్యలో రిటైరైన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్నారు. 

ప్రభుత్వ వైఖరి చూస్తుంటే 2020 వరకూ వేతన సవరణ వచ్చేలా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని తొలగించడం దారుణమన్నారు అశోక్ బాబు. గత ప్రభుత్వ పథకాలు రద్దు చేసి ఆ డబ్బు కొత్త పథకాలకు పెడుతున్నారని అశోక్‌బాబు వైయస్ జగన్ పై విమర్శలు గుప్పించారు.