Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో దిగజారుతున్న పరిస్ధితులు.. ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాలి: ఎమ్మెల్సీ అశోక్ బాబు

జూనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఈ రకమైన అహంభావ పరిస్థితులు నెలకొంటే, సీనియర్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న పరిస్థితి ఏర్పడింది అని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. ఇటీవల పరిణామాలపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు

tdp mlc ashok babu comments on ias officers
Author
Amaravati, First Published Sep 3, 2021, 3:47 PM IST

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన  ఇటీవల పరిణామాలపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకునే చట్టవిరుద్ధ నిర్ణయాలను ఐఏఎస్ అధికారులు వ్యతిరేకించాలని అశోక్ బాబు సూచించారు. కిందిస్థాయి ఉద్యోగులపై అధికారులు చేస్తున్న వేధింపులు ఆపాలని ... పరిపాలనలో ఐఏఎస్ అధికారుల పాత్ర నానాటికీ దిగజారిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఐఏఎస్ అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయని.. ఏదైనా ప్రభుత్వ చట్టాన్ని అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత ఐఏఎస్ లదేనని అశోక్ బాబు గుర్తుచేశారు. ప్రభుత్వ చట్ట విరుద్ధ నిర్ణయాలను ఐఏఎస్ అధికారులు ధైర్యంగా వ్యతిరేకించాలని.. ఏది సబబో ప్రభుత్వానికి తెలియజెప్పాలని ఆయన కోరారు. ఈ రెండు అంశాలు లోపించిన కారణంగానే ఐఏఎస్ లు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారని అశోక్ బాబు అన్నారు. ఈ కారణంగానే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, కోర్టులతో అక్షింతలు వేయించుకోవడం జరుగుతోందని  ఆయన స్పష్టం చేశారు. రేపు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రికో, ఆ శాఖ మంత్రికో కోర్టు శిక్ష వేయదు... అధికారికే శిక్ష పడుతుందని ఐఏఎస్ అధికారులు తమ ఉద్యోగ ధర్మం ఏమిటో తెలుసుకోవాలని అశోక్ బాబు హితవు పలికారు.

ఇక రాష్ట్రంలో కిందిస్థాయి ఉద్యోగులపై వేధింపుల పర్వం గత ప్రభుత్వంలో జరిగిందని.. ఈ ప్రభుత్వంలోనూ జరుగుతోందన్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఏరా, యూజ్ లెస్ ఫెలో అనే పదాలు వాడారని అశోక్ బాబు గుర్తుచేశారు. మీరు ఐఏఎస్ కు సెలక్టయింది వాస్తవమే, మరి మీరు ఐఏఎస్ గా ఆలిండియా లెవల్లో టాపర్ గా ఎందుకు రాలేకపోయారు? మరి మీరు ఐఏఎస్ గా నెంబర్ వన్ గా రానందుకు మేము మిమ్మల్ని యూజ్ లెస్ ఫెలో అని అంటే ఎలా ఉంటుంది అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

మీ కింద పనిచేసే ఎమ్మార్వోలు కూడా సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి సెలెక్ట్ అయిన వ్యక్తులేనని గుర్తించాలని అశోక్ బాబు హితవు పలికారు. వాళ్లను పట్టుకుని ఏరా, యూజ్ లెస్ ఫెలో అనడం సరికాదని.. వ్యాక్సిన్లు ఆరోగ్యశాఖ బాధ్యత అని దాన్ని రెవెన్యూ సిబ్బందికి అప్పగిస్తారా అంటూ ఆయన దుయ్యబట్టారు. రెవెన్యూ సిబ్బందికి కంటే మెడికల్ సిబ్బందే ఎక్కువమంది ఉన్నారని.. వ్యాక్సిన్ బాధ్యత వారికే అప్పగించాలి గానీ, దానికి ఎమ్మార్వోను బాధ్యుడ్ని చేసి దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. జూనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఈ రకమైన అహంభావ పరిస్థితులు నెలకొంటే, సీనియర్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న పరిస్థితి ఏర్పడింది అని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు

Follow Us:
Download App:
  • android
  • ios