ఏపీ సీఎం వైఎస్ జగన్ పై పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయనపై పాపం పసివాడు కాదు అవినీతి రత్న పేరుతో సినిమా తీయాలని అన్నారు. 

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 'పాపం పసివాడు' సినిమా తీయాలని పవన్ కల్యాణ్ అంటే 'అవినీతి రత్న' అని తీయాలని టిడిప ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేసారు. ఇలా జగన్ పై వివిధ సినిమాల పేరుతో ప్రతిపక్ష నాయకులు సెటైర్లు వేస్తున్నారు.ముఖ్యమంత్రి అవినీతిపై సినిమా తీయాల్సి వస్తే ఈ పేర్లు సరిపోతాయంటూ ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇలా 'అవినీతి రత్న' పేరుతో జగన్ పై సినిమా తీయాలని పంచుమర్తి అనురాధ సెటైర్లు వేసారు. 

 పేదల ద్రోహి సీఎం జగన్ ను పట్టుకుని పేదల పెన్నిధి అని సిగ్గు ఎగ్గు లేకుండా మంత్రులు స్టేట్ మెంట్లు ఇవ్వడం అవివేకమని అనురాధ అన్నారు. నిజమైన పేదల పెన్నిధి చంద్రబాబు నాయుడని ప్రజలే అంటున్నారని అన్నారు. జగన్ పేదల ద్రోహి అనడానికి ఎన్నో ఉదాహరణలు వున్నాయన్నారు. పేదల ఆకలిబాధ తీర్చడానికి చంద్రబాబు అన్నా క్యాంటిన్ లు పెడితే జగన్ అధికారంలోకి రాగానే వాటిని ధ్వంసం చేసాడని... ఇది పేదలకు ద్రోహం చేయడం కాదా అన్నారు. పేదల నోటికాడి కూడు లాగేసినవారు పేదల పెన్నిధి ఎలా అవుతారని అనురాధ ప్రశ్నించారు. 

కులమతాలు చూడకుండా చంద్రబాబు సీఎంగా వుండగా సంక్రాంతి, రంజాప తోఫా అందించామని అన్నారు. టిడిపి హయాంలో మత్స్యకారులు, చేనేత కార్మికులు , గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇచ్చామన్నారు. చివరకు మానవతాదృక్ఫధంతో హిజ్రాలకు కూడా పెన్షన్లు ఇచ్చిన గొప్పమనసు చంద్రబాబు నాయుడుదని అన్నారు. కానీ ఇతర పథకాల ద్వారా లబ్ది పొందితే వృద్దాప్య పెన్షన్లను జగన్ సర్కార్ రద్దు చేస్తోందని... ఇలాంటి సీఎం పేదల పెన్నిధి ఎలా అవుతారని అనురాధ అడిగారు. 

Read More పాపం పసివాడు.. జగన్ పై పవన్ కల్యాణ్ సెటైర్ ట్వీట్..

 టిడిపి ప్రభుత్వ హయాంలో దాదాపు 15 లక్షల టిడ్కో ఇళ్లు కట్టి 11 లక్షల ఇళ్లను పంపిణీ చేసామని అనురాధ అన్నారు. మరో 2లక్షలకు పైగా ఇళ్లు ఎన్నికల వల్ల పంపిణీ చేయలేకపోయామని... వాటిని కూడా ఈ వైసిపి ప్రభుత్వం పూర్తిచేసి పేదలకు ఇవ్వలేకపోయిందని అన్నారు. టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వం పేదల పెన్నిధి ఎలా అవుతుంది? అని అనురాధ నిలదీసారు. 

ఇక టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే జగన్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసాడని అనురాధ అన్నారు. ఇది చాలదన్నట్లు ప్రభుత్వ అవనీతిని ప్రశ్నించినవారిని అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇలా పేదలకు తీరని ద్రోహం చేస్తున్న వారు పేదల పెన్నిధులా? అంటూ ఎమ్మెల్సీ అనురాధ మండిపడ్డారు.