అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో  తెలంగాణకు ఆస్తులు అప్పగించడంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. ఆంధ్రప్రదేశ్ ఆస్తులను ఎలా ఇచ్చేస్తారంటూ ప్రశ్నించింది. 

దీంతో స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఎందుకు వచ్చేశారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హడావిడిగా ఎందుకు వచ్చారో ప్రజలకు తెలియజేయాలని అంతేకానీ తమపై నిందలు వేయోద్దంటూ హెచ్చరించారు. 

దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అసెంబ్లీలో స్పీకర్ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు టీడీపీ స్పష్టం చేసింది. 

ఇకపోతే స్పీకర్ పై తెలుగుదేశం పార్టీ మెుదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతును స్పీకర్ నొక్కేస్తున్నారంటూ ఆరోపించారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభను వాకౌట్ చేయడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను బయటపెడుతున్నామనే భయంతో అసెంబ్లీ నుంచి పారిపోయిందని విమర్శించారు.