విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరేందుకు అనేక పార్టీలకు చెందిన నేతలు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.

భవిష్యత్‌లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే నిలుస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. టీడీపీ చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు. 

కేవలం రాజకీయ మనుగడ కోసమే కొన్ని పార్టీలు ఇంకా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్లో హోదా అంశం బలంగా ఉంటే తొలి సంతకం చేస్తామన్న కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా ఎందుకు చేశారని ఆయన అడిగారు. 

ప్రజావేదిక విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజావేదిక మాదిరిగానే అన్ని అక్రమ కట్టడాలను పడగొట్టి ముఖ్యమంత్రి తన నిబద్దతను నిరూపించుకోవాలన్నారు.