మంత్రి అవంతి శ్రీనివాస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఎమ్మెల్యే ఫండ్‌ ఇస్తామంటూ మంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఫండ్‌ లేదనే విషయం తెలియకపోవడం అవంతి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. తాను సూటిగా అవంతిని ప్రశ్నిస్తున్నానని.. అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే ఫండ్‌ ఉందా అన్నారు.

తానూ ఎమ్మెల్యేనే కదా! నిజంగా ఎమ్మెల్యే ఫండ్‌ లేదని వెలగపూడి స్పష్టం చేశారు. ఒకవేళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పి నా ఎమ్మెల్యే నిధులు కూడా ఇప్పిస్తే తాను కూడా భీమిలి నియోజకవర్గానికి నా ఫండ్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. లేనిపోని అబద్ధాలు చెప్పొద్దని.. ప్రజల్ని ప్రేమతో గెలవాలని వెలగపూడి చురకలంటించారు.