విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తొలిసారిగా ప్రశంసలు కురిపించారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ప్రభుత్వం తీసుకున్న మద్యపాన నిషేధ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ అధికారులు మాత్రం దాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం విధానం వినియోగించుకుని, ఎక్సైజ్ అధికారులు షాపుల కోసం వాస్తవంగా ఉన్న ధర కంటే ఎక్కువ ధరను చూపించి దోచేస్తున్నారని ఆరోపించారు. 

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. పార్టీల పరంగా షాపులు ఎంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం 20 శాతం షాపులను మూసి వేస్తామని చెప్పి, ప్రధాన నగరాల్లో ఒక్క షాపు కూడా మూసి వేయలేదని విమర్శించారు. 

ఆగిపోయిన 20 శాతంలో ఎక్కువగా రెన్యువల్ చేసుకోకుండా ఆగిపోయినవేనని చెప్పుకొచ్చారు. 20 శాతం షాపులను మూసివేస్తామని చెప్తున్న ప్రభుత్వం 20 శాతం బార్లను కూడా తగ్గించాలి కదా అని నిలదీశారు. ఎందుకు తగ్గించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. 

మద్యపాన నిషేధం చేపడితే ఎక్సైజ్ ఆదాయం ఎలా పెరుగుతుందని నిలదీశారు. గతంలో రూ. 17 వేల కోట్లు ఉండే ఎక్సైజ్ ఆదాయం ఇప్పుడు రూ. 2 వేల కోట్లు అదనంగా చూపించారని ఇది ఎలా సాధ్యమో చెప్పాలని నిలదీశారు. 

గ్రామీణ ప్రాంతాల్లో షాపులు తగ్గిస్తే నాటుసారా ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే వాటిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖలో సిబ్బంది లేరని, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.