Asianet News TeluguAsianet News Telugu

పార్టీ ఫిరాయింపుపై పుకార్లు: వల్లభనేని వంశీ మాట ఇదీ

గన్నవరం ఎమ్మెల్యే , టీడీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను  మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బీజేపీ చేరాలని ఆహ్వానించినట్టుగా ప్రచారం సాగుతోంది.కొంత కాలంగా  టీడీపీ సమావేశాలకు వంశీ దూరంగా ఉంటున్నారు

tdp mla vallabhaneni vamshi clarifies on sujana chowdary meeting
Author
Amaravathi, First Published Jun 26, 2019, 3:35 PM IST


అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే , టీడీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను  మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బీజేపీ చేరాలని ఆహ్వానించినట్టుగా ప్రచారం సాగుతోంది.కొంత కాలంగా  టీడీపీ సమావేశాలకు వంశీ దూరంగా ఉంటున్నారు.  ఇవాళ చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశానికి కూడ ఆయన దూరంగా ఉన్నారు. తాను బీజేపీలో చేరడం లేదని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఇదంతా ఒట్టి ప్రచారమేనని తేల్చేశారు.

యూరప్ పర్యటన నుండి వచ్చిన చంద్రబాబునాయుడు ఇవాళ తన నివాసంలో పార్టీ నేతలతో చర్చించారు. ఈ సమావేశానికి విజయవాడలో ఉండి కూడ కొందరు కాపు నేతలు హాజరుకాలేదు. అయితే  అందరికీ ఈ సమావేశానికి  చంద్రబాబునాయుడు ఆహ్వానాన్ని పంపలేదని  ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు చెప్పారు.ఈ సమావేశానికి కూడ వల్లభనేని వంశీ హాజరుకాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నిర్వహించిన సమావేశాల్లో వంశీ పాల్గొనలేదు.

రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో  విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎంపీలు రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ ఇచ్చారు.  ఈ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్టుగా సమాచారం.

టీడీపీని వీడి బీజేపీలో చేరాలని సుజనా కోరినందునే ఆయన  పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా.... మరేదైనా కార్యక్రమాల వల్ల ఈ సమావేశానికి ఆయన హాజరు కాలేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

2014 ఎన్నికలకు ముందు విజయవాడలో జగన్ ప్రదర్శన సాగుతున్న సమయంలో  వల్లభనేని వంశీని ప్రస్తుత మంత్రి కొడాలి నాని పరిచయం చేశారు.ఆ సమయంలో జగన్‌ను వంశీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు. ఈ ఘటన ఆనాడు టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వేర్వేరు పార్టీల్లో  ఉన్నా కూడ కొడాలి నానితో  వల్లభనేని వంశీ కి మంచి సంబంధాలే ఉన్నాయి.  ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఆశనిపాతంగా మారాయి. ఈ పరిస్థితుల్లో  టీడీపీలోని కీలక నేతలను తమ వైపుకు లాక్కొనేందుకు బీజేపీ గాలం వేస్తోంది.

ఈ క్రమంలోనే వంశీకి బీజేపీ గాలం వేసేందుకు మాజీ కేంద్ర మంత్రి సుజనా రంగంలోకి దిగాడనే ప్రచారం సాగుతోంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన టీడీపీ నేతలతో సుజనా చౌదరి చర్చలు జరుపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఇదిలా ఉంటే  బీజేపీలో చేరుతున్నానని వస్తున్న వార్తలపై వల్లభనేని వంశీ స్పందించారు. తనతో సుజనా చౌదరి మాట్లాడలేదని స్పష్టం చేశారు.  బీజేపీలో చేరుతున్నాననే ప్రచారం  అవాస్తవమన్నారు.  కార్యకర్తలు ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. బుధవారం నాడు ఆయన ఓ మీడియా చానెల్‌ కు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios