ప్రజారోగ్యాన్ని కాపాడటంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి ఏలూరులో ప్రబలిన వింతవ్యాధే ఉదాహరణ అని టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. 

తాగునీటిలోని వ్యర్థాలు, కలుషితాల వల్లే సమస్య తలెత్తిందని ఢిల్లీ ఎయిమ్స్ చెబుతుంటే.. ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి అటువంటిదేమీ లేదని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

ఏలూరులో 1వ తేదీ నాటికే సమస్య తలెత్తితే, వ్యాధిపీడితుల సంఖ్య వందలసంఖ్యకు చేరేవరకు ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిలో సీరియస్ నెస్ లేకపోబట్టే, ఏలూరులో వింతవ్యాధి పీడితుల సంఖ్య పెరిగిందన్నారు. 

రోగులు సమస్యను పూర్తిగా గుర్తించకుండానే  ప్రభుత్వం ఆదరాబాదరాగా వ్యాధిగ్రస్తులను ఎందుకు డిశ్చార్జ్ చేయిస్తోంది. న్యూరాలజిస్టులు లేకుండా సాధారణ ఫిజీషియన్లతో వైద్యం చేయిస్తే  వింతవ్యాధి తీవ్రత ఎలా తెలుస్తుంది? అంటూ ప్రశ్నించారు. 

కరోనా వైరస్ సమయంలో కోవిడ్ వ్యర్థాలు, ఏలూరు తాగునీటి కాలువల్లో కలవడం వల్లే ఈపరిస్థితి తలెత్తిందని స్థానికులు వాపోతున్నారు. పంపులచెరువునుంచి సరఫరా అయ్యే తాగునీరు కూడా కారణమని చెబుతున్నారని చెప్పుకొచ్చారు. 

పంపులచెరువుని పరిశీలించకుండా ప్రభుత్వం మీడియాను ఎందుకు నియంత్రిస్తోంది? అని సూటి ప్రశ్న వేశారు.   

ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనకపోతే, ఏలూరు ఘటనలే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.