అమరావతి:  ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ  శాసనసభపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడును ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.

మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత టిడ్కో ఇళ్లపై చర్చ కోసం టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు.

ఈ విషయమై మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు  గద్దె రామ్మోహన్, మంతెన రామరాజులకు అవకాశం కల్పించినట్టుగా స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులను తమ స్థానాలకు వెళ్తే  మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని  స్పీకర్ చెప్పారు. స్పీకర్ పోడియం వద్దే  టీడీపీ సభ్యులు నిలబడి నినాదాలు చేశారు.

also read:వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మూడు కంటే తక్కువ సీట్లొస్తాయి: జగన్

టీడీపీ సభ్యుల నిరసనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న  టీడీపీ సభ్యులపై విమర్శలు గుప్పించారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న సభ్యులను  మార్షల్స్ తో బయటకు పంపించాలని  జగన్  స్పీకర్ ను కోరారు.

ఈ సమయంలో ఏపీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిమ్మల రామానాయుడును సస్పెన్షన్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. సస్పెన్షన్ కు గురైన టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడును సభ నుండి బయటకు వెళ్లాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు.