గుంటూరు: అహంభావంతో రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుండా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని టీడీపీనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలకు అనుగుణంగానే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నికలను బ్లాక్ రూల్స్, బ్లాక్ పాలిటిక్స్ మయం చేసిందని ఆరోపించారు. 

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీం తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపదెబ్బలాంటిదని అన్నారు. స్థానిక ఎన్నికలను పూర్తిగా రద్దుచేసి, రీనోటిఫికేషన్ ఇచ్చి తిరిగి రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని రామానాయుడు డిమాండ్  చేశారు. 

''వ్యవస్థలను ఎలా దిగజార్చవచ్చో జగన్ ప్రభుత్వంలో చూస్తున్నాం. నియంత పాలన ఎలా ఉంటుందో ఎన్నికల ప్రక్రియలో, జగన్ పాలనలో చూశాం. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకోసం రిజర్వేషన్ ప్రక్రియను నీరుగార్చింది. గెలిచే అవకాశమున్న వర్గాలకు, తమపార్టీ వారికి అనుకూలంగా వాటిని ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ మార్చేశారు. 175 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా రిజర్వేషన్లు అమలుచేశారు. బీసీలున్న చోట ఓసీలు, ఓసీలున్నచోట బీసీలు, ఎస్సీలున్న చోట బీసీలు ఇలా అంతా గందరగోళం చేశారు'' అని ఆరోపించారు. 

''చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో 19ఎంపీటీసీల రిజర్వేషన్లు ఇష్టానుసారం మార్చేశారు. డీలిమిటేషన్ పేరుతో ప్రతిపక్షం గెలిచే చోట ఎన్నికలు వాయిదా వేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక డీలిమిటేషన్ అమలుచేయలేదు. ఆపేరు చెప్పి స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం దిగజార్చింది. దేశ ఎన్నికల చరిత్రలో ఇంతతక్కువ వ్యవధి ఉన్న ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడూ రాలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీచేసేలా ఒక్కరోజులోనే నోటిఫికేషన్,షెడ్యూల్ ఇచ్చేసి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లింది'' అని మండిపడ్డారు. 

read more  వైసిపిలో చేరనున్నట్లు ప్రచారం... క్లారిటీ ఇచ్చిన టిడిపి మాజీ ఎమ్మెల్యే బిసి

''స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా కోడ్ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగాయి. ఈ విషయాలన్నీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతాం. స్థానిక ఎన్నికల కోడ్ అమల్లో ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలిగింది. రాష్ట్రంలో ప్రతిజిల్లాలో శ్రీకాకుళం నుంచి చిత్తూరువరకు ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల హోర్డింగ్ లు, బ్యానర్లు కనిపిస్తూనే ఉన్నాయి. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, తహసీల్దార్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎన్నికల కోడ్ ని ఖాతరు చేయకుండా ప్రవర్తించారు. పెన్షన్లనీ, రేషన్ కార్డులని, ఇళ్లపట్టాలని ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు'' అని వెల్లడించారు.

''ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రాష్ట్రంలో ఎక్కడాకూడా ఎన్నికల కోడ్ అమలు కాలేదనే విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియచేయనున్నాం. రిజర్వేషన్లకే ఎసరు పెట్టేలా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కుల, ఇతర ధృవపత్రాలు అందించకుండా అభ్యర్థులను వేధించారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎమ్మార్వోలు సదరు పత్రాలు ఇవ్వకుండా తాము అందుబాటులో లేమని, తమకు ఇచ్చేఅధికారం లేదని చెబుతూ తప్పించుకున్నారు. రాష్ట్రమంతా నామినేషన్లు వేయకుండా చూడాలన్న దురుద్దేశంతో కావాలనే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు'' అని తెలిపారు. 

''ఎన్నికల నిర్వహణ ముసుగులో అధికారపార్టీ నేతల బెదిరింపులు, ప్రలోభాలు, దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులుపెట్టడానికి కూడా వెనుకాడలేదు. అధికారపార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారు. చట్టాన్ని, న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే బ్లాక్ మెయిల్  చేశారు. ప్రతిపక్షం నుంచి గెలిచినా కూడా, వారిని అనర్హులను చేసేలా ప్రభుత్వం డబ్బు, మద్యం పేరుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది'' అని ఆరోపించారు. 

''కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏకగ్రీవాలన్నీ బలవంతంగా జరిగినవే. ఎన్నికల్లో గెలవడంకోసం ప్రత్యర్థి పార్టీలవారిని అంతంచేయడానికి కూడా ప్రభుత్వం వెనుకాడలేదు.  మున్సిపల్, పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో ప్రత్యర్థి పార్టీలవారిని బెదిరిస్తున్నారు'' అని  తెలిపారు. 

read more  ఓవైపు కరోనా... మరోవైపు ప్రకృతి విపత్తు: ఉత్తరాంధ్రకు పొంచివున్న ప్రమాదం

''కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగేలా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి. స్పీకర్ సహా మంత్రులంతా కల్లుతాగిన కోతుల్లా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తూలనాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎస్ఈసీకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. కరోనా లైఫ్ లో ఒక భాగమన్నట్లుగా ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటు'' అని రామానాయుడు విరుచుకుపడ్డారు.