చంద్రబాబు అరెస్ట్ .. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకున్నా ఐ డోంట్ కేర్ : బాలయ్య ఘాటు వ్యాఖ్యలు
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ గురించి సినీరంగం నుంచి ఎవరు స్పందించుకున్నా పట్టించుకోనన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్పందించుకున్నా డోంట్ కేర్ అంటూ బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ గురించి సినీరంగం నుంచి ఎవరు స్పందించుకున్నా పట్టించుకోనన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్పందించుకున్నా డోంట్ కేర్ అంటూ బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తుల విషయాన్ని చంద్రబాబు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. ఓట్ల కోసం 3 రోజులుగా ఎన్టీఆర్ జపం చేస్తున్నారని బాలయ్య పరోక్షంగా బీఆర్ఎస్ నేతలపై పంచ్‌లు విసిరారు. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని.. చంద్రబాబు అరెస్ట్‌పై అక్క పురందేశ్వరితో టచ్‌లోనే వున్నానని బాలకృష్ణ తెలిపారు.
చంద్రబాబు నిజాయితీ గురించి అందరికీ తెలిసిందేనని.. రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో వుందని.. ఇప్పుడు మళ్లీ చైతన్యం వస్తోందని బాలయ్య అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు వున్నాయని.. అందుకే చంద్రబాబు అరెస్ట్‌ను మూడు రోజుల నుంచి ఇక్కడి నేతలు ఖండిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం కాకుండా తెలుగువారి కోసం పనిచేద్దామని బాలయ్య పిలుపునిచ్చారు.
ప్రజా క్షేత్రంలోనే తాము తేల్చుకుంటామని.. తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ లేదు అన్న వారికి మెమెంటో చూపిస్తామని.. తప్పకుండా ఇక్కడా టీడీపీ జెండా రెపరెపలాడుతుందని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం వుందో లేదో మాకు తెలియదని.. కానీ తాము ఎవరిపైనా అనవసరంగా నిందలు వేయమన్నారు. ఈ విషయంపై తప్పకుండా కేంద్ర పెద్దలను కలుస్తానని బాలయ్య చెప్పారు. రోజా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. బురద మీద రాయి వేస్తే మన మీదే పడుతుందన్నారు.