టీడీపీ నేతల మధ్య అంతర్యుద్ధాలు మరోసారి బయటపడ్డాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జన్మభూమి-మా ఊరు కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సభలో ఎంపీ ప్రసంగానికి ముందే.. సభ నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకివెళితే... శుక్రవారం గోరంట్లలోని ఎమ్మార్సీ ప్రాంగణంలో జన్మభూమి గ్రామసభను ఎంపీడీఓ ఆజాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప, ముందుగానే గ్రా మసభకు హాజరై ప్రజలతో చర్చాకార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఎమ్మెల్యే తన అనుచరులతోపాటు గ్రామసభకు హాజరయ్యారు. సభకు వచ్చిన దగ్గర నుంచి తాను మరో కార్యక్రమానికి వెళ్లాలంటూ ఎమ్మెల్యే తొందరపెట్టారు.
 
అయితే ఎంపీడీఓ వేదికపై కుడివైపు నుంచి జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎంపీటీసీ ల చేత ప్రసంగించేలా చేశారు. ఎంపీ వంతు వచ్చినప్పుడు ‘ఆయన నిదానంగా మాట్లాడతారు. నేను తొందరగా వెళ్లాలి’ అంటూ ఎమ్మెల్యే బీకే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే తన అనుచరులతోపాటు వేదికపై నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. తరువాత ప్రసంగాన్ని ప్రారంభించిన ఎంపీ నిమ్మలకిష్టప్ప సభికులను ఉద్దేశించి ఎందుకు నవ్వుతున్నారని ప్రశ్నిస్తూ రాజకీయాలు మామూలేనంటూ సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే లేకుండానే ఎంపీ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.