వైట్ హౌస్ ముట్టడించినా ఇంత భద్రత వుండదట..: జగన్ సెక్యూరిటీపై గోరంట్ల సెటైర్లు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను చూసి విదేశాల్లో వుండే తన కూతురు ఆశ్చర్యపోయిందని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను మరింత పెంచడంపై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేసారు. ఇప్పటికే పరదాలు కట్టుకుని తిరుగుతున్న జగన్ ఎస్ఎస్జి (స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్) పెట్టుకోవడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదన్నారు. అధికారంలో వుండేది మరికొన్ని రోజులే... అప్పటివరకైనా ప్రజా తిరుగుబాటు నుండి తప్పించుకునే ఏర్పాట్లే ఇవన్నీ అని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేసారు.
ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ బిల్లు-2023పై టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభద్రతాభావంతోనే ఈ ఎఎస్జి భద్రత ఏర్పాటుచేసుకుంటున్నారని అన్నారు. ప్రజల నుండి తిరుగుబాటు వచ్చిందని... ఏం చేసినా జగన్ కు ఈ ఆరు నెలలే సమయమని బుచ్చయ్యచౌదరి అన్నారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేవలం ఇంటినుండి అసెంబ్లీకి రావడానికే సీఎం జగన్ మూడువేల మంది పోలీసులను భద్రతగా పెట్టుకున్నారని టిడిపి ఎమ్మెల్యే పేర్కొన్నారు. విదేశాల్లో వుండే తన కూతురు ఇటీవలే ఇక్కడికి వచ్చిందని... జగన్ భద్రతను చూసి ఆమె ఆశ్చర్యపోయిందని అన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముట్టడి కార్యక్రమం జరిగినా ఇంత భద్రత వుండదని తన కూతురు ఆశ్చర్యపోయిందని ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి అన్నారు.
Read More చంద్రబాబు సీట్లో కూర్చోవయ్యా బాబు... మేము కోరుకునేది అదే: బాలకృష్ణతో అంబటి (వీడియో)
ఇదిలావుంటే అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజయిన ఇవాళ కూడా గందరగోళం నెలకొంది. తమ నాయకుడు చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు పట్టుబడుతూ టిడిపి సభ్యులు శాసనసభ, మండలిలో ఆందోళన చేపట్టారు. బాలకృష్ణతో పాటు మరికొందరు సభ్యులు విజిల్స్ ను సభలోకి తీసుకువచ్చారు. వైసిపి సభ్యులు మాట్లాడుతున్న సమయంలో విజిల్ ఊదుతూ నిరసన తెలిపారు. ఇలా చంద్రబాబు సీటువద్దకు చేరుకున్న బాలకృష్ణ కూడా విజిల్ ఊదారు. దీంతో ఆయనపై మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందుకే కదా బాలకృష్ణను మెంటల్ అనేది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి సైకోలను సభకు రానివ్వొద్దనని... ఇప్పుడు విజిల్ తెచ్చినట్లే గన్ తెచ్చి కాల్చినా కాలుస్తాడని ఆందోళన వ్యక్తం చేసారు. ముందే మెంటల్ సర్టిఫికెట్ వుంది కాబట్టి కాల్చిచంపినా బాలకృష్ణపై కేసులుండవని వైసిపి ఎమ్మెల్యే మదుసూధన్ ఎద్దెవా చేసారు.
ఇక శాసనసభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోన్లతో చిత్రీకరిస్తున్నారంటూ టిడిపి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెదాళం అశోక్ ను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేసారు. నిన్నకూడా ఇలాగే కొందరు టిడిపి ఎమ్మెల్యేలు నిబంధనలకు విరుద్దంగా సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తున్నారంటూ స్పీకర్ హెచ్చరించారు. అయితే వారు తీరు మార్చుకోకుండా ఇవాళ కూడా వీడియోలు తీస్తున్నట్లు స్పీకర్ దృష్టికి వైసిపి సభ్యులు తీసుకొళ్లారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసారు. మండలిలో కూడా ఆందోళన చేపట్టిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్సీలను ఛైర్మన్ సస్పెండ్ చేసారు. ఎమ్మెల్సీలు బిటి నాయుడు, అనురాధను ఇవాళ ఒక్కరోజే సస్పెండ్ చేసినా శ్రీకాంత్ ను మాత్రం అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేసారు.