రాజమండ్రి: రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించడంలో విఫలమైన వైసిపి ప్రభుత్వం దీన్నుండి దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు.  అందువల్లే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు బెయిల్, ఆనందయ్య కరోనా మందుపై వివాదం సృష్టించారని అన్నారు. 

''రాజు గారి బెయిల్ కొన్ని రోజులు. అది అయిపోయాక ఇప్పుడు అనందయ్య గారి మందు. అది సరే. ముఖ్యమంత్రి గారు ఇంతకీ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సంగతి ఏంటి! ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు. ఎన్ని వచ్చాయి! ఓహో! అంటే మీరు ఎలాగూ డైవర్ట్ చేద్దామనుకున్నారు కదా. ఇదేనా అది!" అంటూ గోరంట్ల ట్విట్టర్ వేదికన సీఎం జగన్ ను ఎద్దేవా చేశారు. 

read more  ఆనందయ్య మందు బ్లాక్ మార్కెటింగ్: రూ. 20 వేలతో నాగరాజు అనే వ్యక్తి పరారీ, పోలీసులకు ఫిర్యాదు

ఇదిలావుంటే ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసిందని ఆరోపించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయుర్వేద మందుపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని కానీ ప్రభుత్వం ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయకుండా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించిందని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి పిలుపుతో కృష్ణపట్నంలో ప్రజలు గుమిగూడారని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోందని... ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని ప్రతిపక్షనేత ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని పట్టించుకోవాల్సిన సీఎం జగన్.. కక్షసాధింపులకే పరిమితమయ్యారని చంద్రబాబు ఆరోపించారు.

కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే ఎదురు దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

అలాగూ ఎంపీ రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం కేసు పెట్టారని ... గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రావా? అని చంద్రబాబు నిలదీశారు. రఘురామను హింసించడం బాధాకరమని... ఎంపీని పోలీసులు వేధించారని సుప్రీంకోర్టులో తేలిందని ప్రతిపక్షనేత గుర్తుచేశారు.