విజయవాడ: గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. 

తెలుగుదేశం పార్టీ 110 నుంచి 140 సీట్లు రావడం ఖాయమని సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ 135 అసెంబ్లీ, 18 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సీఎం చంద్రబాబు నాయుడు కష్టార్జితం వృధాకాదన్నారు. అందువల్లే ప్రజలు టీడీపీకి పట్టం కట్టనున్నట్లు తెలిపారు. కేంద్రం ఏపీ రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకుందని విమర్శించారు. కేంద్రం సహకారంతో ఈసీ టీడీపీకి అన్యాయం చేసిందని మండిపడ్డారు. 

ప్రధాని, మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరన్నారు. వైసీపీ గెలుస్తోందంటూ సోషల్ మీడియాలోబెట్టింగ్ రాయుళ్లు  తప్పుడు ప్రచారం చేసి అమాయకులను మోసం చేస్తున్నారని బుచ్చయ్యచౌదరి ఆరోపించారు.