పార్టీ మార్పు వార్తలపై స్పందించిన గంటా శ్రీనివాసరావు.. ఆయన ఏమన్నారంటే..
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలు మాత్రమే కాదని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలు మాత్రమే కాదని అన్నారు. పార్టీ మార్పుపై తాను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని చెప్పారు. వంగవీటి రంగా ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో పరిమితం కాదని అన్నారు. రంగా బడుగు, బలహీన వర్గాల నాయకుడని అన్నారు. అందుకే ఆయన అంత తక్కువ సమయం జీవించి ఉన్న.. ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని చెప్పారు. కాపునాడు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారని ఇప్పటికే పలుమార్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు.. ఆ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ.. అధిష్టానం, పార్టీ నేతలతో గ్యాప్ మెయింటెన్ చేస్తున్నారు. ఆయన అధికార వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆ దిశగా మాత్రం గంటా అడుగులు వేయలేదు. మరోవైపు ఒకటి, రెండు సందర్భాల్లో చంద్రబాబును కలిసి గంటా శ్రీనివాసరావు.. పార్టీలో ఉన్నాననే సంకేతాలు పంపారు.
కానీ టీడీపీ నేతలు మాత్రం ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లోనైతే గంటా శ్రీనివాస్ పాల్గొనలేదు. పార్టీ లైన్‌కు మద్దతుగా కూడా ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే ఇటీవల కూడా గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారని.. వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఈ కామెంట్స్ చేశారు.