తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర నిర్విరామంగా 2వేల కిలోమీటర్లు పూర్తిచేసుకోవడంపై మాాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
విశాఖపట్నం : గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకి ప్రస్తుతం నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకి పోలికే లేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి శుక్రవారం ఒక్క అడుగు ముందుకుపడని పాదయాత్ర జగన్ ది అయితే విరామమే లేకుండా సాగుతున్న పాదయాత్ర లోకేష్ ది అని అన్నారు. వారంలో మూడురోజులు విరామం తీసుకుంటూ జగన్ చేపట్టింది రిలే పాదయాత్ర అయితే ఏకదాటిగా 2000వేల కిలోమీటర్లు నడిచిన లోకేష్ ది రియల్ పాదయాత్ర అని మాజీ మంత్రి గంటా పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో పాదయాత్ర అనేది గొప్ప ప్రక్రియ అని... ప్రజలవద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని మాజీ మంత్రి అన్నారు. ఇలా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, నారా లోకేష్ పాదయాత్ర చేసారని అన్నారు. వీరిలో జగన్ ఒక్కరే ప్రతి గురువారం పాదయాత్రకు విరామం ఇచ్చి తిరిగి సోమవారం ప్రారంభించేవారని అన్నారు.
వీడియో
లోకేష్ యువగళం పాదయాత్ర విరామంలేకుండా 2వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాలను చుట్టేసిన లోకేష్ 30లక్షల మందిని కలుసుకున్నారని అన్నారు. లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ కు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చిందని... దీంతో ఎక్కడ తమ పార్టీకి నష్టం జరుగుతుందని భావించే వైసిపి ప్రభుత్వం, నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి వైసిపి నాయకులు ఓర్వలేకపోతున్నారని మాజీ మంత్రి అన్నారు.
Read More జనవాణిలో ఫిర్యాదులు, వాలంటీర్లపై కోపం లేదు: పవన్ కళ్యాణ్
వైసిపి నాయకులు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చామని అంటున్నారే... అందులో అతి ముఖ్యమైనది మధ్యపాన నిషేదం ఏమయ్యిందని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లు రాష్ట్రంలో గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతోందని ఆరపించారు. పెన్షన్లు కూడా మూడు వేలు చేస్తామన్నారు... మళ్ళీ ఎన్నికలు వస్తున్నా అందింకా అమలుకావడంలేదు ఎందుకంటూ ప్రశ్నించారు.
ఇక విశాఖపట్నం ప్రజలు సరదాగా సాయంకాలం సమయంలో బీచ్ కు వచ్చి సేదతీరుతుంటారు... ఆ అవకాశం కూడా చేయాలని వైసిపి ప్రభుత్వం చూసిందన్నారు గంటా శ్రీనివాసరావు. రుషికొండ బీచ్ కు వచ్చేవారి దగ్గర రూ.20 ప్రవేశ రుసుము వసూలు చేయాలని భావించారని... ప్రజా వ్యతిరేకతను చూసి వెనక్కి తగ్గారని అన్నారు. ఇప్పటికైనా రుషికొండ బీచ్ ప్రవేశ రుసుం విషయంలో వెనక్కి తగ్గినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
